ఇయ్యాల ప్రభుత్వ లాంఛనాలతో కైకాల అంత్యక్రియలు

ఇయ్యాల  ప్రభుత్వ లాంఛనాలతో  కైకాల అంత్యక్రియలు
  • హైదరాబాద్ ఫిల్మ్​నగర్‌‌‌‌లోని తన ఇంట్లో తుది శ్వాస
  •     777 సినిమాల్లో నటించిన సత్యనారాయణ 
  •     నవరస నటసార్వభౌముడిగా వెండితెరపై చెరగని ముద్ర
  •     ఇయ్యాల జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

హైదరాబాద్, వెలుగు: వెండి తెరపై యముడిగా మెరుపులు మెరిపించిన కైకాల సత్యనారాయణ (87) ఇకలేరు. వయోభారంతోపాటు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు హైదరాబాద్ ఫిల్మ్​నగర్‌‌‌‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. కైకాల మరణవార్త తెలుసుకుని రాజకీయ, సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.ప్రధాని నరేంద్ర మోడీ, గవర్నర్ తమిళిసై, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, ప్రముఖ నటులు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, జూనియర్ ఎన్టీఆర్, ఆర్.నారాయణమూర్తి, దర్శకుడు కె.రాఘవేంద్రరావు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. 1935 జులై 25న కృష్ణా జిల్లా కౌతవరంలో జన్మించిన కైకాల.. ‘సిపాయి కూతురు’ సినిమాతో తొలిసారి మెరిశారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్​బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ సహా మూడు తరాల హీరోల సినిమాల్లో నటించారు. 777 సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి అభిమానులను సంపాదించుకున్నారు. చివరిగా ఆయన ‘మహర్షి’ సినిమాలో నటించారు. 1994లో ‘బంగారు కుటుంబం’ చిత్రానికిగాను నంది అవార్డును దక్కించుకున్నారు. 2011లో రఘుపతి వెంకయ్య పురస్కారం, 2017లో ఫిల్మ్​ఫేర్​ లైఫ్​టైం అచీవ్​మెంట్ అవార్డును అందుకున్నారు. కైకాలకు భార్య నాగేశ్వరమ్మ, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. రాజకీయాల్లోనూ ఆయన తనదైన ముద్ర వేశారు. 1996లో టీడీపీ అభ్యర్థిగా మచిలీపట్నం నుంచి ఎంపీగా గెలిచారు.

కన్నీళ్లు పెట్టుకున్న చిరంజీవి

కైకాల పార్థివ దేహానికి ప్రముఖ హీరో చిరంజీవి, జనసేన అధినేత, హీరో పవన్ కల్యాణ్ నివాళులర్పించారు. తర్వాత కైకాల కుటుంబ సభ్యులను పరామర్శించిన చిరంజీవి.. ఒకింత భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. తనను తమ్ముడూ అంటూ ఆప్యాయంగా పలకరించేవారని, ఓ మంచి అన్నను కోల్పోయానని భావోద్వేగానికి లోనయ్యారు. పక్కనే ఉన్న పవన్ కల్యాణ్ చిరంజీవిని ఓదార్చారు. ఆహార్యం, అభినయం, ఆంగికాల కలబోత కైకాల సత్యనారాయణ అని హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు.

అధికార లాంఛనాలతో అంత్యక్రియలు: కేసీఆర్

శనివారం ఉదయం 10.30 గంటలకు కైకాల అంత్యక్రియలను జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా సీఎస్​ సోమేశ్​కుమార్​కు సీఎం కేసీఆర్​ ఆదేశాలిచ్చారు. కైకాల మృతదేహానికి శుక్రవారం కేసీఆర్ నివాళులర్పించారు. కైకాల కుటుంబ సభ్యులను పరామర్శించారు. సినీ రంగంలో తొలితరం నటుడిగా విభిన్న పాత్రలను పోషిస్తూ మూడు తరాల ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారని సీఎం గుర్తు చేసుకున్నారు. హీరోలతో పోటీ పడుతూ కైకాల నటించారని, ఆయనో గొప్ప వ్యక్తి అని అన్నారు. ఆయన మరణం సినీ రంగానికి తీరని లోటన్నారు. 

అవార్డులు

1994లో ‘బంగారు కుటుంబం’ సినిమాకు నంది అవార్డు 
2011లో రఘుపతి వెంకయ్య పురస్కారం
2017లో ఫిల్మ్​ఫేర్​ లైఫ్​టైం అచీవ్​మెంట్ అవార్డు


గొప్ప నటుడిని కోల్పోయాం

సత్యనారాయణ వంటి గొప్ప నటుడు చనిపోయారన్న విషయం తెలిసి దిగ్భ్రాంతి కలిగింది. ఆయన వైవిధ్యమైన పాత్రలు, నటనతో అన్ని తరాల ప్రేక్షకులకు దగ్గరైన నటుడు. కైకాల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్న.
- ట్విట్టర్​లో ప్రధాని మోడీ