
2023 వ సంవత్సనంలో కైలాస మానస సరోవర యాత్రకు తేదీలు, ధరను ప్రకటించారు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఈ యాత్రను కొనసాగిస్తారు. ఈ ఏడాది టికెట్ ధర 2 లక్షల 50 వేల రూపాయిలుగా నిర్ణయించారు. కోవిడ్ -19 తర్వాత మొదటిసారిగా 2023లో కైలాస మానస సరోవర యాత్రను ప్రారంభించారు. మూడేళ్ల తరువాత చైనా ప్రభుత్వం కైలాస మానస సరోవర్ యాత్రికుల కోసం నేపాల్-చైనా సరిహద్దులో అనేక పాయింట్లను తెరిచారు
కైలాస మానస సరోవర్ ప్రత్యేకత ఏమిటి?
కైలాస మానస సరోవర్ యాత్ర అనేది వివిధ మతాల భక్తులకు అపారమైన ప్రాముఖ్యతనిచ్చే తీర్థయాత్ర. ఇది హిందూ మతంలో శివుని నివాసంగా పరిగణించబడుతుంది, అలాగే బౌద్ధమతం, జైనమతం మరియు బోన్లలో ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రదేశంగా పరిగణించబడుతుంది. కైలాస పర్వతం టిబెట్‌లోని ట్రాన్స్-హిమాలయాలోని కైలాష్ శ్రేణిలో ఉంది. ఈ ప్రయాణం సాధారణంగా నేపాల్‌లోని ఖాట్మండులో ప్రారంభమవుతుంది. అక్కడి నుండి యాత్రికులు సరిహద్దు పట్టణమైన జాంగ్ము గుండా టిబెటన్ పీఠభూమికి ప్రయాణిస్తారు.. కైలాస మానస సరోవర పర్యాటకులకు ఇండియా , చైనా ప్రభుత్వాలు కొన్ని మార్గదర్శకాలు రూపొందిస్తాయి.
కొత్త నిబంధనలు
కైలాష్ మానస సరోవర్ యాత్ర 2023 కోసం దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. చైనా కఠినమైన నిబంధనలతో యాత్రకు వీసాలు జారీ చేయడం ప్రారంభించింది. టిబెట్ టూరిజం బ్యూరో ప్రకారం గతంలో ఒక వ్యక్తికి టికెట్ ధర లక్షా 50 వేల రూపాయిలుండగా ఈ ఏడాది 2 లక్షల 50 వేలకు పెంచారు. ఇప్పటి వరకు వీసాను ఆన్ లైన్ లో తీసుకొనే అవకాశం ఉంది. కాని ఈ ఏడాది వీసా తీసుకోవడానికి యాత్రికులు భౌతికంగా హాజరుకావాలని నిబంధనలు అమలు చేస్తున్నారు . ఆన్‌లైన్ దరఖాస్తు అంగీకరించబడవని అధికారులు తెలిపారు. వీసాలు పొందే భారతీయ యాత్రికులు కనీసం ఐదుగురు ఉండాలంటూ... వారిలో కనీసం నలుగురు భౌతికంగా హాజరు కావాలని చైనా అధికారులు పేర్కొన్నారు.