
ఓవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీసులు అంటూ క్షణం తీరిక లేకుండా దూసుకెళ్తోంది కాజల్. అయితే ఆమె నటించిన ఒక సినిమా మూడేళ్లు దాటినా రిలీజ్‌కి నోచుకోలేదు. అదే ‘ప్యారిస్ ప్యారిస్’. ఇదేమీ లో బడ్జెట్ సినిమా కాదు. రమేష్ అరవింద్ డైరెక్షన్‌లో ప్రెస్టీజియస్‌గా స్టార్టయింది. షూటింగ్ పూర్తయింది. టీజర్ కూడా రిలీజైంది. కానీ చివర్లో సెన్సార్ ఇష్యూస్ తలెత్తడంతో విడుదల ఆగిపోయింది. అయితే ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ మూవీ ‘క్వీన్’ అఫీషియల్ రీమేక్ ఇది. లీడ్ రోల్‌లో కంగనా అద్భుతంగా నటించి నేషనల్ అవార్డు కూడా అందుకుంది. దీన్ని ఒకేసారి నాలుగు భాషల్లో రీమేక్ చేయడం మొదలు పెట్టారు. తెలుగులో ‘దటీజ్ మహాలక్ష్మి’, కన్నడలో ‘బటర్‌ఫ్లై’, మలయాళంలో ‘జామ్ జామ్’, తమిళంలో ‘ప్యారిస్ ప్యారిస్’ టైటిల్స్ ఫిక్స్ చేశారు. తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో తమన్నా, పారుల్ యాదవ్, మంజిమా మోహన్ లీడ్ రోల్స్ చేశారు. ఆ మూడింటికీ సెన్సార్ వర్క్ కూడా కంప్లీటయ్యింది. అయితే కాజల్ నటించిన తమిళ వెర్షన్‌కి మాత్రం సమస్యలు వచ్చాయి. కొన్ని సీన్లు, డైలాగ్స్ అభ్యంతరకరంగా ఉన్నాయంటూ క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో రిలీజ్ ఆగిపోయింది. అలా యేళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు ఓటీటీల హవా పెరిగింది. చాలా సినిమాలు రిలీజవుతున్నాయి. పైగా ఓటీటీల్లో సెన్సార్ లాంటి ఆటంకాలేమీ ఉండవు కాబట్టి డిజిటల్ రిలీజ్‌కి రెడీ అవుతోందట ‘ప్యారిస్ ప్యారిస్’ టీమ్. త్వరలోనే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ వెబ్ సిరీసులతో ఓటీటీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న కాజల్.. తమిళ ‘క్వీన్’గానూ అలరిస్తుందేమో చూడాలి మరి.