ఉత్సాహంగా కాకా మెమోరియల్ క్రికెట్ పోటీలు..ఫస్ట్ డే పాలమూరు, నారాయణపేట విన్..

ఉత్సాహంగా కాకా మెమోరియల్ క్రికెట్ పోటీలు..ఫస్ట్ డే  పాలమూరు, నారాయణపేట విన్..

తిమ్మాపూర్, వెలుగు: కరీంనగర్​ జిల్లా తిమ్మాపూర్​ మండలం అలుగునూర్​లోని  కరీంనగర్​ క్రికెట్​ అసోసియేషన్,​ వెలిచాల జగపతిరావు మెమోరియల్​ గ్రౌండ్​లో కాకా వెంకటస్వామి స్మారకార్థం నిర్వహిస్తున్న టీ-20 క్రికెట్​ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 

హైదరాబాద్  క్రికెట్  అసోసియేషన్​ ఆధ్వర్యంలో మొదటిరోజు మంగళవారం రెండు మ్యాచ్​లు జరిగాయి. మొదటి మ్యాచ్‌లో కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జట్లు తలపడ్డాయి. ముందుగా బ్యాటింగ్​ చేసిన రాజన్న సిరిసిల్ల జట్టు  18 ఓవర్లలో 104 పరుగులు చేయగా, కరీంనగర్ జట్టు 16.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 

రెండో మ్యాచ్‌లో జగిత్యాల, పెద్దపల్లి టీమ్స్​ తలపడ్డాయి. జగిత్యాల జట్టు 18 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 105పరుగులు చేయగా, అనంతరం బాటింగ్​కు దిగిన పెద్దపల్లి జట్టు 3 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని సొంతం చేసుకుంది.

 బుధవారం ఉదయం రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, మధ్యాహ్నం కరీంనగర్‌‌, జగిత్యాల జట్ల మధ్య  పోటీ ఉంటుందని  కరీంనగర్​ క్రికెట్​ అసోసియేషన్​ ప్రెసిడెంట్​ వెలిచాల ఆగంరావు తెలిపారు. వైస్​ ప్రెసిడెంట్​ కోడూరి మహేందర్‌‌గౌడ్‌, పి.మనోహర్​ రావు, సెక్రటరీ ఎన్.మురళీధర్‌‌రావు, ఈసీ మెంబర్లు హరికృష్ణగౌడ్, ఆర్‌‌.సాగర్‌‌రావు, సీహెచ్‌.అజిత్‌కుమార్‌‌  టోర్నమెంట్‌ను పర్యవేక్షించారు. 

 పాలమూరు, నారాయణపేట విన్..

మహబూబ్​నగర్: నగరంలో మంగళవారం జరిగిన కాకా వెంకటస్వామి మెమోరియల్  క్రికెట్​ పోటీల్లో పాలమూరు, నారాయణపేట జట్లు గెలిచాయి. తొలి మ్యాచ్ లో​ జోగులాంబ గద్వాల జట్టు 17.3 ఓవర్లలో 94 రన్స్​చేయగా, నారాయణపేట టీమ్​ రెండు ఓవర్లు మిగిలి ఉండగానే 96 పరుగులు చేసి విజయం సాధించింది. 

రెండో మ్యాచ్​లో మహబూబ్​నగర్​ముందుగా బ్యాటింగ్​ చేసి 220 భారీ స్కోరు చేయగా, వనపర్తి జట్టు ఆరు వికెట్లను కోల్పోయి 109 పరుగులు మాత్రమే చేసింది. జిల్లా క్రికెట్ సంఘం చీఫ్ పాట్రాన్ మనోహర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, సభ్యులు సురేశ్ కుమార్, అశోక్, గోపాలకృష్ణ, అబ్దుల్లా, మన్నాన్  పాల్గొన్నారు. గ్రౌండ్​ క్యూరేటర్  సత్యనారాయణ యాదవ్ ను నిర్వాహకులు సన్మానించారు.