
- కాకా వెంకటస్వామి బాటలో సాగుతున్నం: మంత్రి వివేక్
- పేదలు, కార్మికుల కోసం ఎంతో కృషి చేశారు: మంత్రి పొన్నం
- ఆ మహానేత జీవితం స్ఫూర్తిదాయకం: మంత్రి శ్రీధర్ బాబు
- కాంగ్రెస్‌కు అంకితభావంతో పనిచేశారు: మంత్రి వాకిటి శ్రీహరి
- నీతి, నిజాయితీకి కాకా నిలువుటద్దం: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
- ఆయన సేవలు చిరస్మరణీయం: జానారెడ్డి
- జనం గుండెల్లో నిలిచిపోయారు: అంజన్ కుమార్ యాదవ్
- ఏది ఉన్నా ముఖం ముందే చెప్పేవారు: బండారు దత్తాత్రేయ
- తెలంగాణ ఏర్పాటులో కాకా కీలక పాత్ర పోషించారు:
- మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య
హైదరాబాద్, వెలుగు: పేదలు, బడుగు వర్గాల కోసం కాకా వెంకటస్వామి జీవితాంతం పోరాడారని, వారి అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొనియాడారు. కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా, ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారని గుర్తుచేశారు. అటు కాంగ్రెస్ పార్టీకి, ఇటు ప్రజలకు కాకా చేసిన సేవలు మరువలేనివని తెలిపారు.
ముఖ్యంగా కార్మికుల కోసం ఆయన అమలు చేసిన కార్యక్రమాలు, తీసుకొచ్చిన చట్టాలు ఎంతో మేలు చేశాయని పేర్కొన్నారు. కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి (కాకా) 96వ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. హైదరాబాద్‌లోని ట్యాంక్బండ్పై ఉన్న ఆయన విగ్రహానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి, పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్, ప్రజా సంఘాల నేతలు, ప్రముఖులు నివాళులర్పించారు.
ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ‘‘కాకా తన చిన్ననాటి నుంచే సమాజంలోని బడుగు బలహీన వర్గాల కోసం తపించారు. పేదలు, కార్మికుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారు. ఆయన బడుగుల పెన్నిధి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు” అని గుర్తుచేశారు.
అలాంటి మహనీయుడికి రాష్ట్ర కాంగ్రెస్ నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఘనమైన నివాళ్లు అర్పిస్తున్నామని భట్టి తెలిపారు. కాకా వెంకటస్వామి ఆశయాలను, మార్గాలను అనుసరిస్తూ..పేద ప్రజల కోసం పాటుపడుదామని పిలుపునిచ్చారు.
అంచెలంచెలుగా ఎదిగారు: అంజన్ కుమార్
తెలంగాణకే కాకుండా యావత్ దేశానికి కాకా వెంకటస్వామి విశిష్ట సేవలు అందించారని మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ తెలిపారు. ‘‘రాష్ట్ర, కేంద్ర మంత్రిగా ఆయన పని చేసి పేదల అభ్యున్నతికి కృషి చేశారు. ఎంతో మంది పేదలకు గుడిసెలు వేయించి వారికి ఆవాసం కల్పించారు. కార్మిక లోకం కోసం పాటుపడ్డారు. అంచెలంచెలుగా ఎదిగి జనం గుండెల్లో నిలిచిపోయారు. కాకా పేరు తెలంగాణలో ఎల్లపుడూ మార్మోగుతూ ఉంటుంది” అని చెప్పారు.
ఏది ఉన్నా ముఖం ముందే చెప్తుండె: దత్తాత్రేయ
వెనక మాట్లాడే అలవాటు కాకా వెంకటస్వామికి లేదని, ఏది ఉన్న ముఖం ముందే చెప్పేవారని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. పేద వర్గాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని, కార్మికుల శ్రమ దోపిడీనిఅరికట్టేందుకు కేంద్ర మంత్రిగా ఎన్నో చట్టాలను తీసుకువచ్చి అండగా నిలిచారని తెలిపారు.
రాష్ట్ర ఏర్పాటులో కాకా పాత్ర కీలకం: చెన్నయ్య
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాకా వెంకటస్వామి కీలక పాత్ర పోషించారని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య అన్నారు. ‘‘తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఆకాంక్షను ఢిల్లీలో సోనియాగాంధీకి చెప్పి రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన ఘనత కాకా వెంకటస్వామిది. అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఢిల్లీ వెళ్లి.. తెలంగాణ స్వరాన్ని వినిపించిన ఏకైక తెలంగాణ నాయకుడు ఆయన. తెలంగాణ వచ్చాకే తన ప్రాణం పోతుందని గట్టిగా పోరాటం చేసిన గొప్ప నేత కాకా. పేదలకు అండగా నిలిచిన వెంకటస్వామిని ప్రేమగా అందరూ కాకా అని పిలుస్తారు. హైదరాబాద్ మహానగరంలో ఇల్లు లేని ఎంతో మంది నిరుపేదలకు గుడిసెలు వేయించి ఆసరాగా నిలిచినందుకు ఆయనను గుడిసెల వెంకటస్వామి అంటారు” అనిగుర్తుచేసుకున్నారు.