సింగరేణి లాభాల్లో ఉండటానికి కారణం కాకా వెంకటస్వామి: మంత్రి వివేక్

సింగరేణి లాభాల్లో ఉండటానికి కారణం కాకా వెంకటస్వామి: మంత్రి వివేక్

పెద్దపల్లి: సింగరేణి సంస్థ లాభాల్లో ఉండడానికి దివంగత నేత, తన తండ్రి కాకా వెంకటస్వామి కారమణని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంగళవారం (సెప్టెంబర్ 23) పెద్దపల్లి పట్టణంలోని శాంతి నగర్ ఏరియాలో ఉన్న దుర్గా మాత మండపంలో మంత్రి వివేక్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్‎కి శాలువా కప్పి సత్కరించారు ఆలయ కమిటీ సభ్యులు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ.. పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర ప్రజలు సుఖ శాంతులతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నానని తెలిపారు. 1995లో సింగరేణి నష్టాల్లోకి వెళితే ఆనాటి కేంద్ర మంత్రి, తన తండ్రి కాకా వెంకటస్వామి ప్రధానిని ఒప్పించి సింగరేణికి రూ.10 వేల కోట్లు సహకారం అందించారని గుర్తు చేశారు. ఇవాళ సింగరేణి లాభాల్లో ఉందంటే దానికి కారణం కాక వెంకటస్వామి అని అన్నారు.

సింగరేణి అభివృద్ధి కోసం కాకా వెంకటస్వామి నుంచి తన కుమారుడు, ఎంపీ గడ్డం వంశీ కృష్ణ వరకు కృషి చేస్తున్నారని చెప్పారు. తాను పెద్దపల్లి ఎంపీగా ఉన్న కాలంలో రామగుండం ఫెర్టిలైజర్ కంపెనీ మూతపడితే.. దానిని తెరిపించడం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రూ.6 వేల కోట్ల ఆర్ధిక సహాయం అందేలా చూశానని గుర్తు చేశారు.