హైదరాబాద్లో మందు తాగుతూ చనిపోయాడు

హైదరాబాద్లో  మందు తాగుతూ చనిపోయాడు

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అక్టోబర్ 1వ తేదీ ఆదివారం విషాదం చోటు చేసుకుంది. వైన్స్ పర్మిట్ రూంలో ఓ వ్యక్తి మద్యం సేవిస్తూ మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. 

శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రాళ్లగుడ రోడ్డులోని  వైన్స్ షాపులో  శంషాబాద్ ఎయిర్ పోర్టులో పనిచేసే ఇద్దరు సిబ్బంది మద్యం సేవించేందుకు వచ్చారు. వైన్స్ సిట్టింగ్ రూం లో మద్యం సేవిస్తూ ఉన్నారు. అయితే మందు తాగుతూ కాకర్ల శ్రీను అనే వ్యక్తి హఠాత్తుగా కింద పడిపోయాడు. దీంతో భయాందోళనకు గురైన అతని స్నేహితుడు బయటికి పరుగు తీశాడు. ఏమైందంటూ స్థానికులు అతన్ని పట్టుకొని ప్రశ్నించారు. తన స్నేహితుడు కాకర్ల శ్రీను మద్యం సేవిస్తూ..అకస్మాత్తుగా పడిపోవడంతో భయాందోళన గురై బయటికి పరుగు తీశానని తెలిపాడు. 

అనంతరం లోపలికి వెళ్లి శ్రీనును పరిశీలించగా స్పృహ కోల్పోయి పడిపోయి ఉన్నాడు. స్థానికులు అతన్ని లేపేందుకు తీవ్రంగా ప్రయాణించినా ఫలితం లేదు.  వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు శ్రీను చనిపోయినట్లు ధృవీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మృతుడు కాకర్ల శ్రీనుది శ్రీకాకుళం జిల్లా టెక్కలి గ్రామం. కాకర్ల శ్రీను(44) భార్య సావిత్రి(40), 9 ఏండ్ల కుమారుడు ఉన్నారు. వీరు దాదాపు 15 సంవత్సరాల నుంచి శంషాబాద్  ఎయిర్ పోర్టులో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే  కుటుంబ కలహాలతో భార్యాభర్తలు విడిపోయి జీవిస్తున్నారు. ఐదేండ్ల క్రితం ఇద్దరు విడాకులకు అప్లై చేసుకున్నారు. ప్రస్తుతం ఆ కేసు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.ఈ నేపథ్యంలో శ్రీను మద్యానికి అలవాటు పడ్డాడని స్థానికులు తెలిపారు.