
చేవెళ్ల, వెలుగు : అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ జనాలకు ఎలాంటి మేలు చేయలేదని బీఆర్ఎస్ చేవెళ్ల సెగ్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి కాలె యాదయ్య విమర్శించారు. ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా శనివారం ఆయన రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని ఆలూరు గ్రామానికి వెళ్లారు. మహిళలు మంగళహారతులతో యాదయ్యకు ఘన స్వాగతం పలికారు. ఆయన ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్కు ఓటేయాలని అభ్యర్థించారు.
అనంతరం ప్రచార సభ నిర్వహించగా.. బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు.ఈ సందర్భంగా యాదయ్య మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందన్నారు. ఎన్నికల ముందు అడ్డగోలుగా మాట్లాడే ఇతర పార్టీల అభ్యర్థుల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. జనాలను మోసం చేయడం ఎవరి వల్ల కాదన్నారు. మూడోసారి తనను గెలిపిస్తే చేవెళ్లను మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి రమణారెడ్డి, జడ్పీటీసీ మెంబర్ మర్పల్లి మాలతి కృష్ణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.