ప్రిన్సిపల్ సెక్రటరీ బదిలీ చేసినా వెళ్లలే..చొప్పదండిని వదలని ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ శ్రీధర్

ప్రిన్సిపల్ సెక్రటరీ బదిలీ చేసినా వెళ్లలే..చొప్పదండిని వదలని ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ శ్రీధర్
  •  ప్రిన్సిపల్ సెక్రటరీ బదిలీ చేసినా వెళ్లలే
  • నూనె శ్రీధర్ ఈఎన్సీ అనిల్ అండతో అక్కడే
  • చొప్పదండిని వదలని ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్
  • శ్రీధర్ ను కస్టడీకి తీసుకొని విచారించనున్న ఏసీబీ
  • ఈఎన్సీ అనిల్ పాత్రపైనా కొనసాగుతున్న దర్యాప్తు
  •  నీటిపారుదల శాఖను కుదిపేసిన వ్యవహారం

హైదరాబాద్: అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టుగా ఉంది కాళేశ్వరం అవినీతి  పరిస్థితి. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో మూడు ప్యాకేజీలకు బాధ్యుడిగా వ్యవహరించిన చొప్పదండి ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ నూనె శ్రీధర్ భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ దర్యాప్తులో తేలడంతో ఆయనకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది కోర్టు. శ్రీధర్ కు ఈఎన్సీ అనిల్ అండదండలు దండిగా ఉన్నట్టు తెలుస్తోంది. గత ఏడాది జూన్ 27న శ్రీధర్ ను బదిలీ చేస్తూ నీటిపారుదల శాఖ చీఫ్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. ఇరిగేషన్ చీఫ్ ఆఫీసులో రిపోర్టు చేయాలన్నది బదిలీ ఉత్తర్వుల సారాంశం. అయితే శ్రీధర్ మాత్రం చొప్పదండిని వదల్లేదు. రాహుల్ బొజ్జా ఆర్డర్స్ ను తొక్కిపెట్టి ఈఎన్సీ అనిల్ అండదండలతో అక్కడే కొనసాగాడు. బదిలీ అయినప్పటికీ దాదాపు ఏడాదిగా అక్కడే విధులు నిర్వర్తిస్తుండటం గమనార్హం. 

ఏసీబీ కస్టడీకి శ్రీధర్?

కాళేశ్వరం ఎగ్జిక్యూటీవ్ ఇంజినీరుగా వ్యవహరించి వందల కోట్ల ఆస్తులను కూడబెట్టుకున్న నూనె శ్రీధర్ ను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేయనున్నారు. భారీగా అక్రమాస్తులు సంపాదించిన ఆయన వెనుక ఎవరున్నారు..? ఈ మొత్తం వ్యవహారంలో ఈఎన్సీ అనిల్ పాత్ర ఉందా..? బదిలీ అయినా ఎందుకు వెళ్లలేదు..? ఎవరి అండదండలతో ఆయన అక్కడే కొనసాగారు..? తదితర అంశాలపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు.