
- నివేదికపై కమిషన్ కసరత్తు...
- అధికారుల స్టేట్మెంట్లు, డాక్యుమెంట్ల పరిశీలన
- విధానపర నిర్ణయాలు తీసుకున్న పెద్దలను
- పిలిచే విషయంపై ఇంకా రాని క్లారిటీ
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ విచారణ తుది దశకు చేరుకుంది. అధికారులందరినీ విచారించిన కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్.. రిపోర్టుపైనే ప్రత్యేకంగా దృష్టి సారించారు. శనివారం హైదరాబాద్‌కు వచ్చిన ఆయన.. వారంపాటు ఇక్కడే ఉండనున్నారు. కమిషన్ నివేదికను సిద్ధం చేస్తున్నారు. అందుకు రిపోర్టులో ఏమేం పెట్టాలన్న దానిపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే అందుకు తగ్గట్టుగా ఇప్పటిదాకా ఇంజినీర్లు ఇచ్చిన వాంగ్మూలాలు, ఐఏఎస్ అధికారులు, కాగ్ అధికారులు చెప్పిన వివరాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నట్టు తెలిసింది. వారు చెప్పిన అంశాలతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఇచ్చిన జీవోలు, ఉత్తర్వులు, పరిపాలనా అనుమతులు, ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అనుమతులకు సంబంధించిన డాక్యుమెంట్లనూ కమిషన్ పరిశీలన చేస్తున్నట్టు తెలిసింది. రిపోర్టు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నదని సమాచారం. ఇప్పటికే మేడిగడ్డ కుంగుబాటుపై విచారణ జరిపిన విజిలెన్స్ డిపార్ట్మెంట్ అందుకు సంబంధించిన తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఇటు ఎన్డీఎస్ఏ నివేదిక కోసం కూడా కమిషన్ ఎదురు చూస్తున్నది. ఆ రెండు రిపోర్టులను వీలైనంత త్వరగా ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ లేఖ రాసినట్టు తెలిసింది. రిపోర్ట్ పూర్తయ్యాక చీఫ్ సెక్రటరీకి సమర్పించే అవకాశాలున్నాయని సమాచారం.
పెద్దలను పిలుస్తరా లేదా?
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన నిర్మాణ, ఆర్థిక అవకతవకలపై అధికారుల నుంచి దాదాపు అన్ని వివరాలను కమిషన్ రాబట్టింది. అధికారుల విచారణ పూర్తి కావడంతో.. నాడు ఆ ప్రాజెక్టు విషయంలో విధానపరమైన నిర్ణయాలు తీసుకున్న పెద్దలను పిలుస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. నివేదికలో పొందుపరిచే అంశాలు, అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా వారిని విచారణకు పిలిచేది లేనిది ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తున్నది. ఈ వారంలోపే ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిసింది. న్యాయపరమైన సమస్యలు రాకుండా కమిషన్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నదని సమాచారం. కాగా, కమిషన్ రిపోర్ట్‌ను సమర్పించేందుకు సర్కారు ఏప్రిల్ చివరి వరకు గడువును పొడిగించింది.