
- హైదరాబాద్ చేరుకున్న జస్టిస్ ఘోష్
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టుపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలపై కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ దృష్టి సారించింది. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు బ్యారేజీని షిఫ్ట్ చేయడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల లొకేషన్ల మార్పు, కాంట్రాక్ట్‌ల అప్పగింత వంటి వాటిపై గత బీఆర్ఎస్ సర్కారు కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను కమిషన్ పరిశీలించనుంది. ఇటీవల ఓపెన్ కోర్టులో భాగంగా ప్రాజెక్టుపై కేబినెట్ ఆమోదంతోనే ముందుకు వెళ్లామని కేసీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్ కమిషన్‌కు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేబినెట్ నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్లను ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కమిషన్ ఆదేశించింది.
గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఫైళ్లను గత నెల 30 నాటికి కమిషన్‌కు ప్రభుత్వం అందజేసింది. ఇప్పుడు ఆ ఫైళ్లను కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ స్టడీ చేయనున్నట్లు తెలిసింది. ఆ ఫైళ్లను అధ్యయనం చేసేందుకు ఆదివారం ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. ఫైళ్లలోని అంశాలు, కేసీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్ వెల్లడించిన అంశాల ఆధారంగా రిపోర్టును తయారు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే అధికారుల వాంగ్మూలాల ఆధారంగా ప్రిలిమినరీ రిపోర్టును కమిషన్ సిద్ధం చేసింది. ప్రజాప్రతినిధులనూ విచారించిన నేపథ్యంలో వారి స్టేట్మెంట్ల కూడా రిపోర్టులో చేర్చాల్సి ఉంది.