కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ: లోన్లు తీసుకోవడానికి మీ దగ్గర ఉన్న ఆస్తులు ఏంటని అధికారులను అడగ్గా..

కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ: లోన్లు తీసుకోవడానికి మీ దగ్గర ఉన్న ఆస్తులు ఏంటని అధికారులను అడగ్గా..

హైదరాబాద్: కాగ్ రిపోర్టులో ఒకటి రెండు అంశాలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని, మూడు బ్యారేజీల ఎస్టిమేషన్స్ను తాము ముందే ఆడిట్ చేశామని, కాగ్ రిపోర్టుతో తమకు సంబంధం లేదని కాళేశ్వరం ప్రాజెక్టు అకౌంట్స్ ఆఫీసర్లు కమిషన్కు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణలో భాగంగా ముగ్గురు అకౌంట్స్ ఆఫీసర్లు కమిషన్ ముందు బుధవారం హాజరయ్యారు. 

కాళేశ్వరం కార్పొరేషన్ మాజీ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ వెంకట అప్పారావు, ఇరిగేషన్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ పద్మావతి,  వర్క్స్ అండ్ అకౌంట్ డైరెక్టర్ మణిభూషణ్ శర్మపై కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది. ఏ ప్రాతిపదికన లోన్లు తీసుకుంటారని కమిషన్ ప్రశ్నించింది. ప్రభుత్వం నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాతనే కార్పొరేషన్ లోన్కు వెళ్తుందని ఈ అధికారులు చెప్పారు. అందుకు అనుగుణంగానే తమకు నీటిపారుదల శాఖ కార్యదర్శి ఆదేశాలిస్తారని చెప్పుకొచ్చారు.

ALSO READ | నిండుకుండలా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు

నాబార్డ్ నుంచి అప్పులు తీసుకున్నామని వెంకట అప్పారావు కమిషన్కు తెలిపారు. అప్పుడు ఇరిగేషన్ సెక్రటరీగా రజత్ కుమార్ ఉన్నారని వివరణ ఇచ్చారు. పెద్ద మొత్తంలో లోన్లు తీసుకోవడానికి మీ వద్ద ఉన్న ఆస్తులు ఏంటని పీసీ గోష్ ప్రశ్నించారు. తమ వద్ద ఎలాంటి ఆస్తులు లేవని అకౌంట్స్ ఆఫీసర్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే తప్ప తమ వద్ద ఆస్తులు ఉండవని స్పష్టం చేశారు. రామగుండం, ఎన్టీపీసీ  నీళ్లను సరఫరా చేయడం ద్వారా వచ్చే ఆదాయంతోనే మెయింటెనెన్స్ చేస్తామని వివరణ ఇచ్చారు. తీసుకున్న లోన్లను బ్యాంకులో ఫిక్స్ డిపాజిట్ చేశామని, దానిపై వచ్చిన వడ్డీలను మెయింటెనెన్స్ కోసం వినియోగించామని చెప్పారు.

ALSO READ | ఎస్సారెస్పీ కాల్వల నిర్మాణానికి రూ.90 కోట్లు రిలీజ్

కాళేశ్వరం ప్రాజెక్టు ప్లానింగ్ కంటే ముందే లోన్ తీసుకోవాలని డిసైడ్ అయ్యారా అని చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ పద్మావతిని పీసీ గోష్ ప్రశ్నించారు. ప్రాజెక్టు సీఈలు తమకు ప్రతిపాదనలు పంపుతారని, వాటిని ఈఎన్సీలు ఆమోదిస్తారని, ఆ తరువాతనే తాము బడ్జెట్ ప్రిపేర్ చేస్తామని పద్మావతి సమాధానం ఇచ్చారు. కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ప్రభుత్వం ఎలాంటి కేటాయింపులు చేయలేదని పద్మావతి చెప్పారు. మీరు తీసుకున్న అప్పుల్ని బడ్జెట్లో చూపించారా అని కమిషన్ ప్రశ్నించగా, చూపించలేదని పద్మావతి చెప్పడం గమనార్హం. కమిషన్ ప్రశ్నలకు తన పరిధిలో లేని అంశాలంటూ మణి భూషణ్ శర్మ సమాధానం దాటవేశారు. కమిషన్ విచారణకు కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీ అండ్ ఈఎన్సీ హరి రామ్, మేడిగడ్డ ఎస్సీ సర్దార్ ఓంకార్ సింగ్ హాజరు కాలేదు.