మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా పరిస్థితి రణరణంగా మారింది. బీఆర్ఎస్ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఎక్స్ అఫిషియో ఓటు వేసేందుకు క్యాతనపల్లికి వచ్చి మంత్రి వివేక్ ,ఎంపీ వంశీకృష్ణ కాన్వాయ్ లపై రాళ్ల దాడి చేస్తూ బాల్కసుమన్ అనుచరులు గూండాగిరి ప్రదర్శించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
రాళ్ల దాడిలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలకు గాయాలయ్యాయి. అడ్డుకోవడానికి వచ్చిన పోలీసులపైన బీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. కాంగ్రెస్ ,బీఆర్ఎస్ వర్గాల మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. స్వయంగా బాల్కసుమన్ బారీకేడ్లు ,రాళ్లు విసురుతూ రౌడీయిజం ప్రదర్శించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఫిబ్రవరి 16వ తేదీన కోరం లేకపోవటంతో ఎన్నిక వాయిదా పడింది. ఈ క్రమంలోనే అధికారులు 17వ తేదీ.. అంటే ఇవాళ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తున్నారు. నిబంధనల ప్రకారం మంత్రి, ఎంపీ.. ఎక్స్ అఫిషియో సభ్యులుగా తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం మున్సిపల్ ఆఫీసుకు వస్తున్న సమయంలో.. మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నేత బాల్క సుమన్.. అతని అనుచరులు రౌడీలుగా వ్యవహరించారు. గూండాగిరికి దిగారు. క్యాతనపల్లి మున్సిపాలిటీకి వస్తున్న మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీ కృష్ణ కార్లపై రాళ్లతో దాడి చేశారు.
మార్గమధ్యలో మంత్రి, ఎంపీ వెళుతున్న దారిలో ట్రాఫిక్ బారికేడ్లు అడ్డంగా పెట్టారు. బారీగేడ్లు కారణంగా వాహనాల స్పీడ్ తగ్గటం.. ఆ వెంటనే బాల్క సుమన్, అతని అనుచరులు మంత్రి, ఎంపీ కార్లపై రాళ్ల విసిరారు. ఈ దాడిలో మంత్రి, ఎంపీ కార్ల అద్దాలు పగిలాయి. బీఆర్ఎస్ రాళ్ల దాడి నుంచి మంత్రి, ఎంపీ సురక్షితంగా బయటపడ్డారు.
