ఆనపకాయతో మహా అంటే కూర చేసుకోవచ్చు. లేదా పులుసు వండేయొచ్చు. మీరెప్పుడైనా ఆనపకాయతో ఐస్క్రీం చేసుకుని చల్లచల్లగా తిన్నారా? ఉల్లిగడ్డతో కలిపి సూప్ తయారుచేసుకున్నారా? ఈ సూప్ లు, ఐస్ క్రీంలు వద్దనుకుంటే కారంకారంగా పాన్కోక్ చేసుకోవచ్చు.. ఇప్పుడు వీటిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ..
ఆనపకాయతో ఐస్క్రీమ్ తయారీకి కావాల్సినవి
- ఆనపకాయ తరుగు - 500 గ్రాములు
- చక్కెర - ఒక కప్పు
- క్రీమ్- మూడు కప్పులు
- తేనె - రెండు టేబుల్ స్పూన్స్
- యాలకుల పొడి- ఒక టేబుల్ స్పూన్
ఆనపకాయతో ఐస్క్రీం తయారీ విధానం
ఆనపకాయ తరుగు, చక్కెర, యాలకుల పొడిని నాన్ స్టిక్ పాన్ లో వేయాలి. ఆనపకాయ తరుగును మెత్తగా, నీళ్లు ఆవిరి అయ్యేంత వరకు ఉడికించాలి.
ఆ మిశ్రమం చల్లారేవరకు పక్కన పెట్టాలి. అందులో మూడు కప్పుల క్రీమ్, రెండు టేబుల్ స్పూన్లు తేనెను వేసి గాలి చొరబడని కంటైనర్లో ఉంచి ఫ్రీజర్లో ఒక గంటసేపు ఉంచాలి.
ఆ తరువాత వేరొక గిన్నెలోకి తీసుకుని విస్కర్ రెండు నిమిషాలు కలపాలి. మిశ్రమాన్ని బాగా గడ్డకట్టేంత వరకు మళ్లీ ఫ్రీజర్ లో పెట్టుకుంటే చల్లచల్లని ఆనపకాయ ఐస్ క్రీమ్ రెడీ.. ఎండాకాలంలో కూల్ కూల్‌గా ఆరోగ్యమైన ఐస్ క్రీం రెడీ..!
ఆనపకాయ -ఉల్లిగడ్డ సూప్ తయారీకి కావాల్సినవి
- ఆనప (సొర) కాయ తరుగు - రెండు కప్పులు
- ఉల్లిగడ్డ తరుగు - ఒక కప్పు
- ఆలుగడ్డ తరుగు - ఒక కప్పు
- వైట్ సాస్ - ఒక కప్పు
- ఉప్పు తగినంత
- మిరియాల పొడి-కొద్దిగా
- నీళ్లు- రెండు కప్పులు
ఆనపకాయ -ఉల్లిగడ్డ సూప్ తయారీ విధానం
ప్రెషర్ కుక్కర్ లో అనపకాయ, ఉల్లిగడ్డ, ఆలుగడ్డ తరుగు వేసి రెండు కప్పుల నీళ్లు పోసి మూత పెట్టాలి.
మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.
ఆ మిశ్రమం చల్లారాక గరిటెతో మెత్తగా మెదపాలి. తరువాత ఒక పాన్ లోకి మిశ్రమాన్ని తీసుకోవాలి.
అందులో ఒక కప్పు వైట్ సాస్, సరిపడా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి వేసి సన్నటి మంట మీద రెండు నిమిషాలు ఉడికిస్తే. అనపకాయ ఉల్లిగడ్డ సూప్ రెడీ..
సొరకాయతో పాన్ కేక్ తయారీకి కావాల్సినవి
- ఆనపకాయ (చిన్నది) -ఒకటి
- అల్లం- ఒక టేబుల్ స్పూన్
- నీళ్లు - సరిపడా
- పచ్చి మిర్చి- పది
- ఉల్లిగడ్డలు- రెండు
- బియ్యప్పిండి - ఒక కప్పు
- ఉప్పు- తగినంత
- నూనె –-100 గ్రాములు
- జీలకర్ర-ఒక టేబుల్ స్పూన్
సొరకాయతో పాన్ కేక్ తయారీ విధానం
ఆనపకాయ తొక్కతీసి ముక్కలుగా తరగాలి ఆ ముక్కల్ని మిక్సీ పట్టాలి. అందులో ఉల్లిగడ్డ తరుగు, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, బియ్యప్పిండి, ఉప్పు, జీలకర్ర, నీళ్లు వేసి ముద్దలు కలిపి పక్కన పెట్టాలి.
ఒక మందపాటి పాన్ మీద కలిపిన ముద్దనుపెట్టి చూట్టూ వత్తాలి. ఆ తరువాత నూనెను పైన చల్లుతూ పాన్ కేక్‌ను రెండువైపులా కాల్చాలి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.
