- ప్రాణహిత- చేవెళ్ల పూర్తి చేసి ఉంటే ఎల్‌నినోను దీటుగా ఎదుర్కొనేవాళ్లం
- బీఆర్ఎస్ నేతలపై మంత్రి ఉత్తమ్ ఫైర్
- కాళేశ్వరం వైఫల్యానికి కాంట్రాక్టర్లు, గత ప్రభుత్వమే అసలు కారణం
- బ్యారేజీల పునరుద్ధరణకు పక్కా రోడ్ మ్యాప్
- డిసెంబర్ నాటికి పనులు ప్రారంభం
- 2027 వర్షాకాలం నాటికి పూర్తి చేస్తామని వెల్లడి
- మూడు బ్యారేజీల రిపేర్లపై ప్రజెంటేషన్
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు గత బీఆర్ఎస్ ప్రభుత్వ కమీషన్ల కక్కుర్తికి నిదర్శనమని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును పక్కనపెట్టి, కాళేశ్వరం పేరిట మేడిగడ్డకు రీడిజైన్ చేయడమే రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద ‘చారిత్రక తప్పిదం’ అని పేర్కొన్నారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును మార్పులు లేకుండా నిర్మించి ఉంటే, ప్రస్తుతం ఎల్‌నినో కారణంగా ఎదురైన తీవ్ర కరువు పరిస్థితులను రాష్ట్రం ఎంతో దీటుగా తట్టుకునేదని స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్‌లోని సెక్రటేరియెట్ మీడియా సెంటర్లో మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల రిపేర్లకు సంబంధించి కాలపరిమితితో కూడిన ప్రణాళికను ప్రకటించారు. మూడు బ్యారేజీల రిపేర్లకు సంబంధించి టన్నెల్ సెక్రటరీ కల్నల్ పరీక్షిత్ మెహ్రా ప్రజెంటేషన్ ఇచ్చారు.
స్వార్థంతోనే రీడిజైన్
రైతుల దీర్ఘకాలిక ప్రయోజనాలను కాకుండా తన స్వార్థ ప్రయోజనాలను ఆశించే నాటి కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టు రీడిజైన్ చేసిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. రూ.38 వేల కోట్ల అంచనా వ్యయంతో పూర్తయ్యే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చి, రాష్ట్రంపై అప్పుల భారం మోపారని మండిపడ్డారు. అదనంగా వేల కోట్లు ఖర్చు చేసినా రైతులకు నీటి ప్రయోజనం దక్కలేదని తెలిపారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పూర్తై ఉంటే ఉత్తర తెలంగాణలోని సాగునీటి వ్యవస్థ పటిష్టమై ఉండేదని, వర్షాభావ పరిస్థితులను, కరువును అధిగమించే అవకాశం ఉండేదని పేర్కొన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల పేరుతో వేల కోట్లు కుమ్మరించినా బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు.
బ్యారేజీల పునరుద్ధరణకు కార్యాచరణ
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులను వేగవంతం చేసేందుకు 4 ప్రధాన మైలురాళ్లతో కార్యాచరణ రూపొందించినట్టు మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. “సెప్టెంబర్ నెలాఖరు నాటికే కాన్సెప్ట్ డిజైన్ల ప్రక్రియ పూర్తయింది. అక్టోబర్ నెలాఖరు నాటికి పనుల అంచనాల రూపకల్పన, ప్రభుత్వ పరిపాలనా అనుమతుల ప్రక్రియ కంప్లీట్ అవుతుంది.
నవంబర్ నెలాఖరు నాటికి పనులు చేపట్టే కాంట్రాక్ట్ ఏజెన్సీల సమీకరణ (మొబిలైజేషన్) పూర్తవుతుంది. డిసెంబర్ నెలాఖరు నుంచి అన్ని రంగాల్లో పూర్తిస్థాయి పనులు ప్రారంభమవుతాయి. రాబోయే 2027 వర్షాకాలం నాటికి పునరుద్ధరణ పనులన్నింటినీ పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం” అని స్పష్టం చేశారు.
అంతర్జాతీయ నిపుణులతో రిపేర్లు
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) సిఫార్సులకు తగ్గట్టుగానే పనులు చేపడుతున్నామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) బ్యారేజీల వద్ద అవసరమైన టెస్టులు చేస్తున్నదని, ప్రతిష్టాత్మక ఐఐటీ బాంబే భాగస్వామ్యంతో అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ ఆఫ్రీ డిజైన్లను రూపొందిస్తోందని చెప్పారు. కేంద్ర జలశక్తి శాఖ జూన్ 30న ఏర్పాటు చేసిన సాంకేతిక పర్యవేక్షణ కమిటీ (టీవోసీ).. జులై 31, అక్టోబర్ 14 తేదీల్లో సమీక్షలు నిర్వహించి వ్యూహాన్ని ఖరారు చేసిందని తెలిపారు. ఈ పునరుద్ధరణ డిజైన్లు, అదనపు పనులు టీవోసీ, సెంట్రల్ వాటర్ కమిషన్ పరిశీలిస్తున్నాయని చెప్పారు. బ్యారేజీలలో సీపేజీ (నీటి ఊటలు), అప్లిఫ్ట్ ప్రెజర్, నిర్మాణ పటిష్టతను నిరంతరం పర్యవేక్షించేందుకు అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ మానిటరింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు.
స్టిల్లింగ్ బేసిన్ల భారీ విస్తరణ
వరద ఉధృతిని తట్టుకునేలా బ్యారేజీల వద్ద ఉన్న స్టిల్లింగ్ బేసిన్ల పొడవును గణనీయంగా పెంచుతున్నామని మంత్రి ఉత్తమ్ చెప్పారు. ‘‘మేడిగడ్డ వద్ద ప్రస్తుతమున్న 46.8 మీటర్ల నుంచి 66 మీటర్లకు విస్తరిస్తున్నాం. అన్నారం వద్ద 45 మీటర్ల నుంచి 66 మీటర్లు, సుందిళ్ల వద్ద ప్రస్తుతమున్న 30 మీటర్ల నుంచి 58 మీటర్లకు పెంచుతున్నాం” అని వివరించారు. స్టిల్లింగ్ బేసిన్ విస్తరణ, నీటి ఎగపోత ఒత్తిడిని తట్టుకునేందుకు పిల్లర్ల పొడిగింపునకు అవసరమైన కాంక్రీట్ పరిమాణాన్ని లెక్కగడితే.. గతంలో ఈ బ్యారేజీల నిర్మాణానికి ఎంత కాంక్రీట్ వాడారో, దాదాపుగా అంతే కాంక్రీట్ ఇప్పుడు కేవలం మరమ్మతుల కోసమే అవసరమవుతుందని చెప్పారు. గత పాలకులు సృష్టించిన లోపం తీవ్రత అంతటిదని పేర్కొన్నారు.
100% బాధ్యత కాంట్రాక్టర్లదే..
బ్యారేజీలు కూలిపోయిన నష్టానికి వందకు 100 శాతం కాంట్రాక్టర్లదే బాధ్యత అని మంత్రి ఉత్తమ్ చెప్పారు. వారికి అడ్డగోలుగా కాంట్రాక్టులు కట్టబెట్టి, డిజైన్లు మార్పించిన గత పాలకుల బాధ్యత కూడా 100 శాతం ఉందన్నారు. ప్రాజెక్ట్ డీపీఆర్‌లో ఒక ఫౌండేషన్ ఉంటే.. సాంకేతిక అనుమతులు లేకుండా కాంట్రాక్టర్లతో కుమ్మక్కై సీకెంట్ పైల్ ఫౌండేషన్‌గా మార్చాలని నిర్ణయం తీసుకుంది కేసీఆరేనని ఆరోపించారు. ప్రాజెక్టులో భారీ అవకతవకలు జరిగాయనే ఉద్దేశంతోనే నాడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీశ్‌రావును కేసీఆర్ ఆ శాఖ నుంచి తప్పించారని గుర్తుచేశారు.
ప్రస్తుతం కాళేశ్వరంపై సీబీఐ, విజిలెన్స్, న్యాయ విచారణ ముంచుకొస్తుండటంతో జైలుకెళ్లడం ఖాయమని తేలే బీఆర్ఎస్ నాయకులు భయంతో వణికిపోతూ మీడియా ముందు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల.. ఈ మూడు బ్యారేజీల్లోనూ వాడిన ‘సీకెంట్ పైల్ ఫౌండేషన్’ డిజైన్ పూర్తిగా లోపభూయిష్టమని తేలిందన్నారు. పరిష్కారంగా పునాదులను కాపాడేందుకు నదికి ఒక చివర నుంచి ఇంకో చివర వరకు అండర్ గ్రౌండ్లో ‘డయాఫ్రమ్ వాల్’ నిర్మించాలని నిపుణులు నిర్ధారించారని తెలిపారు. రెండో లోపం స్టిల్లింగ్ బేసిన్ వైఫల్యం అని, నీటి ఉధృతిని తగ్గించే స్టిల్లింగ్ బేసిన్ పొడవు, బలం ఎంతమాత్రం సరిపోవడం లేదన్నారు.
ప్రస్తుతం ఈ రెండింటికి సంబంధించిన డిజైన్లు, వ్యయ అంచనాలను సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పాటైన రాజ్యాంగబద్ధమైన ‘నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ’ (ఎన్డీఎస్ఏ) ఆదేశాల ప్రకారమే ప్రభుత్వం నడుచుకుంటోందని స్పష్టం చేశారు. ఎన్డీఎస్ఏ ఏజెన్సీలతో ప్రాథమిక పరీక్షలు, సమగ్ర పరిశోధనలు చేయించకుండా.. ఏదో తూతూమంత్రంగా రిపేర్లు చేసి గేట్లు మూస్తే, మళ్లీ వరదకు బ్యారేజీ కొట్టుకుపోయి వేలమంది జనాలు చనిపోవాలా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ పాలకులు చేసిన తప్పుడు పనుల వల్ల ఇప్పటికే ప్రాజెక్టు సర్వనాశనమైందని, నిపుణుల సమగ్ర నివేదిక రాకుండా తొందరపాటు పనులు చేయడం కుదరదని తేల్చిచెప్పారు.
రాయలసీమ లిఫ్ట్, పోతిరెడ్డిపాడు పాపం బీఆర్ఎస్దే
కృష్ణా జలాల విషయంలో బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్న తీరు హాస్యాస్పదంగా ఉందని మంత్రి ఉత్తమ్ చెప్పారు.. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే ఏపీ ప్రభుత్వం ‘రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు’ చేపట్టిందని, ప్రగతి భవన్లో ఏపీ నేతలతో విందులు చేసుకుంటూ అలయ్-బలయ్ తీసుకున్నారని ఎద్దేవా చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచుకున్నా, మల్యాల కెపాసిటీని విస్తరించు కున్నా చూస్తూ ఊరుకున్నది కేసీఆర్ ప్రభుత్వమే నని మండిపడ్డారు. కానీ, కాంగ్రెస్ అధికారం లోకి వచ్చాక కృష్ణా, గోదా వరి బేసిన్లలో గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో నీటిని వినియోగించుకున్నామని, దానికి సంబం ధించిన అధికారిక గణంకాలు, రికార్డులు నీటిపా రు దల శాఖ వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు.
