
- కాళేశ్వరం ప్రాజెక్టు విచారణపై స్పీడ్ పెంచనున్న జస్టిస్ ఘోష్
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటి వరకు ఒక్కో అధికారిని పిలిచి విచారించిన కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్.. తర్వాతి షెడ్యూల్ లో అందరినీ నేరుగా క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే అధికారుల దగ్గర నుంచి రాతపూర్వక అఫిడవిట్లను తీసుకున్న జస్టిస్ ఘోష్.. వాటిని పరిశీలిస్తున్నారు. ఈ నెల 16 వరకు విచారణ చేసిన ఆయన.. అధికారులు సమర్పించిన అఫిడవిట్లను తీసుకొని కోల్‌కతా వెళ్లారని, వాటిని అక్కడే విశ్లేషిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే ఇప్పటికే విచారణకు పిలిచిన అధికారులను క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని జస్టిస్ ఘోష్ యోచిస్తున్నట్టు తెలిసింది. ఆగస్టు మొదటి వారం తర్వాత ఆయన రాష్ట్రానికి రానున్నట్టు చెబుతున్నారు. ఇక్కడకు రాగానే ఆయన క్రాస్ ఎగ్జామినేషన్ పై దృష్టి సారిస్తారని అధికారులు వెల్లడిస్తున్నారు. దీనికి సంబంధించి ఢిల్లీ లేదా ముంబై నుంచి ఒకరిద్దరు లాయర్లను క్రాస్ ఎగ్జామినేషన్ కోసం నియమించుకునేందుకు ఆయన నిర్ణయించిన సంగతి తెలిసిందే.
కీలకమైన వ్యక్తుల విచారణ పూర్తి..
తొలి మూడు దశల విచారణలో భాగంగా కీలకమైన అధికారులను జస్టిస్ ఘోష్ విచారించారు. తొలి దశలో భాగంగా ప్రాజెక్ట్ సాంకేతికాంశాలపై విచారించిన ఆయన.. ప్రాజెక్ట్ సైట్ లనూ పరిశీలించారు. రెండో దశలో మాజీ ఈఎన్ సీలు, మాజీ సీఈలు, ఇతర అధికారులను విచారించారు. మూడో దశలో మాజీ సీఎస్ సోమేశ్ కుమార్, మాజీ ఇరిగేషన్ సెక్రటరీలు రజత్‌కుమార్, వికాస్‌రాజ్, స్మితా సబర్వాల్, ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణ రావు తదితరులను విచారించారు. కొందరు ప్రైవేట్ వ్యక్తుల వద్ద నుంచి కూడా ఆయన ప్రాజెక్ట్ పై సమాచారం సేకరించినట్టు తెలిసింది. ఇటు సామాన్యుల నుంచి కూడా అఫిడవిట్లు స్వీకరించిన కమిషన్.. వారితో బహిరంగ విచారణనూ ఇదే షెడ్యూల్ లో చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.