- రేపు హైకోర్టు తీర్పు నేపథ్యంలో హైఅలర్ట్
- హుటాహుటిన ఢిల్లీకి హరీశ్ రావు, వినోద్ కుమార్
- ప్రతికూల తీర్పు వస్తే సుప్రీంలో ఎస్ఎల్పీకి న్యాయనిపుణులతో చర్చలు
- పార్టీ ఫిరాయింపుల కేసులోనూ సమాలోచనలు
- ఆర్ఎస్ఎస్, బీజేపీ పెద్దలను కలిశారనే చర్చ
న్యూఢిల్లీ, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించిన కేసులో బీఆర్ఎస్ పార్టీలో టెన్షన్ మొదలైంది. ఈ వ్యవహారంలో రేపు రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో పార్టీ ముఖ్య నేతల్లో ఆందోళన కనిపిస్తున్నది. దీంతో ఈ కేసులో హైకోర్టు తీర్పు ప్రతికూలంగా వస్తే అనుసరించాల్సిన తదుపరి చర్యలపై ఆ పార్టీ కీలక నేతలు హరీశ్ రావు, వినోద్ కుమార్ ఢిల్లీ బాట పట్టారు. సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న నేతలు.. సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్లు దామా శేషాద్రి నాయుడు, ఆర్యమ సుందరంతో విడివిడిగా సమావేశం అయ్యారు.
తొలుత దామా శేషాద్రి నాయుడును ఆయన ఆఫీసులో కలిశారు. దాదాపు అరగంటకు పైగా సాగిన ఈ మీటింగ్‌లో కాళేశ్వరంపై తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో అనుసరించాల్సిన అంశాలపై చర్చించి, న్యాయ సలహా తీసుకున్నారు. సాయంత్రం మరో సీనియర్ అడ్వకేట్ ఆర్యమ సుందరంతో భేటీ అయ్యారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో ప్రస్తుతం హైకోర్టులో వేసిన పిటిషన్, స్పీకర్ తీర్పు, ఇతర అంశాలపై చర్చించారు. వచ్చే నెల 6న ఈ కేసు మరోసారి విచారణకు రానున్నందున స్వయంగా వాదనలు వినిపించేందుకు రావాలని ఆయనను కోరారు.
సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్!
కాళేశ్వరం కేసులో బుధవారం చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్‌ల ద్విసభ్య ధర్మాసనం తీర్పును వెలువరించనుంది. ఇందులో ప్రతికూల తీర్పు వస్తే.. మరుసటి రోజే సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) వేయాలని బీఆర్ఎస్ డిసైడ్ అయింది. ఇందుకు సంబంధించి హరీశ్ రావు, వినోద్ రావు దామా శేషాద్రి నాయుడుతో చర్చలు జరిపారు. కాగా.. కేసీఆర్ ఆదేశాలతో హరీశ్ రావు, వినోద్ రావు ఢిల్లీ రావడం చర్చాంశనీయంగా మారింది.
నేతల హస్తిన పర్యటనపై సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయడంతో.. కాళేశ్వరంపై న్యాయ నిపుణులతో చర్చించేందుకు బీఆర్ఎస్ నేతలు ఢిల్లీ వెళ్లినట్లు పార్టీ శ్రేణులు మీడియాకు సమాచారం ఇచ్చాయి. అయితే.. ఈ పర్యటనలో కేవలం న్యాయ నిపుణులు, సుప్రీంకోర్టు అడ్వకేట్లనే కాకుండా, పలువురు రాజకీయ నేతలతోనూ హరీశ్, వినోద్ సమావేశమైనట్లు ఢిల్లీలో చర్చ జరుగుతున్నది. ప్రధానంగా ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతల్ని కలిసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కాళేశ్వరం కేసు..
బ్యారేజీల నిర్మాణం, నిర్వహణల్లో జరిగిన అవకవకలపై విచారణ నిమిత్తం జస్టిస్ పి.సి.ఘోష్ కమిషన్‌ను నియమిస్తూ 2024 మార్చి 14న జారీ చేసిన జీవో 6ను సవాలు చేస్తూ కేసీఆర్, హరీశ్‌రావు, ఐఏఎస్ స్మితా సభర్వాల్, మాజీ ఐఏఎస్ ఎస్.కె.జోషి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘ వాదనలు విన్న చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్‌ల బెంచ్ విచారణను తొలుత ఈ నెల 8 కి వాయిదా వేసింది.
అనంతరం తీర్పును ఈ నెల 22 కు వాయిదా వేసింది. కాగా.. హరీశ్‌రావు తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రినాయుడు వాదనలు వినిపిస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ ఘోష్ కమిషన్ చేపట్టిన విచారణ ప్రక్రియలోని చట్టబద్ధమైన ఉల్లంఘనలపైనే తాము ప్రశ్నిస్తున్నామన్నారు. సహజ న్యాయసూత్రాలను కమిషన్ పాటించలేదన్నారు.
విచారణకు హాజరుకావాలంటూ కమిషన్ ఇచ్చిన నోటీసులన్నీ ఒకేలా ఉన్నాయన్నారు. ఈ వాదనలపై అధికారుల తరఫు న్యాయవాదులు జె.రామచంద్రరావు, తరుణ్ జి.రెడ్డి అభ్యంతరం తెలిపారు. సాక్షిగా ప్రతివాదులకు నోటీసు ఇచ్చారన్నారు. నిందితులకు షోకాజ్ నోటీసు జారీ చేయాల్సి ఉంటుందన్నారు. విధివిధానాలను పాటించని కమిషన్ నివేదికను రద్దు చేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం తీర్పును వెలువరించాల్సి ఉంది.

