
హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ విచారణ వేగవంతమైంది. ఇవాళ పలువురు అధికారులను కమిషన్ ప్రశ్నించగా.. కీలక అంశాలు బయటపడ్డాయి. కాళేశ్వరం కార్పొరేషన్ పేరిట బ్యాంకుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు అప్పలు తీసుకున్నట్టు పలువురు అధికారులు ఓపెన్ కోర్టుకు వెల్లడించారు. ఆ డబ్బులను డిపాజిట్ చేసి వచ్చిన వడ్డీని ఖర్చులకు వినియోగించుకున్నట్టు తెలిపింది. ఉద్యోగుల జీతాలకు డబ్బులు ఎలా సర్దారని కమిషన్ ప్రశ్నించగా.. కాళేశ్వరం కమిషన్కు ఉద్యోగులు లేరని ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్ పైనే విధులు నిర్వర్తించారని, వాళ్లకు మాతృశాఖలే జీతాలు చెల్లించాయని తెలిపారు.
లోన్లు ఇచ్చిన బ్యాంకులకు ఎలా చెల్లిస్తామని చెప్పారని కమిషన్ ప్రశ్నించగా.. రామగుండం ఎన్టీపీసీకి నీళ్లు అందించడం ద్వారా డబ్బులు వస్తాయని తెలిపామని వివరించారు. కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ప్రాజెక్టుకు ఇవ్వలేదని వివరించారు. ఏ ప్రాతిపదికన లోన్లు తీసుకున్నారని కమిషన్ ప్రశ్నించింది.. ప్రభుత్వం ఇచ్చిన అప్రూవల్ ఆధారంగానే నాబార్డు నుంచి అప్పులు తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. అప్పుడు ఇరిగేషన్ సెక్రటరీగా రజత్ కుమార్ ఉన్నారని తెలిపారు. ఈ డబ్బులను బడ్జెట్ లో చూపించారా..? అని కమిషన్ ప్రశ్నించగా తాము చూపించలేదని సమాధానం ఇచ్చారు.
ఇంత భారీ మొత్తంలో లోన్లు తీసుకునేందుకు మీ వద్ద ఉన్న ఆస్తులేం చూపించారని కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. తమ వద్ద ఎలాంటి అసెట్స్ లేవని ఆఫీసర్లు సమాధానం ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్లానింగ్ కంటే ముందే లోన్ తీసుకోవాలని డిసైడ్ అయ్యారా..? అని చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ ను కమిషన్ ప్రశ్నించగా.. ప్రాజెక్టు సీఈలు తమకు ప్రతిపాదనలు పంపుతారని, వాటిని ఈఎన్సీలు ఆమోదిస్తారని, తర్వాత తాము బడ్జెట్ ప్రిపేర్ చేస్తామని చెప్పారు. కాగ్ రిపోర్టులో ఒకటిరెండు రిపోర్టులు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని వారు కమిషన్ కు తెలిపారు.
ఇవాళ విచారణకు
హాజరైన అధికారులు
వెంకట అప్పారావు కాళేశ్వరం కార్పొరేషన్ మాజీ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్
పద్మావతి ఇరిగేషన్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్
మణిభూషణ్ శర్మ వర్క్ అండ్ అకౌంట్ డైరెక్టర్
విచారణకు రాని వారు
హరి రామ్ కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీ, ఈఎన్సి
సర్దార్ ఓంకార్ సింగ్ మేడిగడ్డ బ్యారేజీ ఎస్,ఈ