ప్రభాస్ నుంచి రాబోతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘కల్కి 2898 ఏడి’. ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దామా అని ఎదురుచూస్తున్నారు అభిమానులు. అందుకు తగ్గట్టే ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాపై అంచనాలు పెంచుతున్నారు మేకర్స్. తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమా కథ విషయంలో క్లారిటీ ఇస్తూ ఓ వీడియోను విడుదల చేశాడు. నాగ్ అశ్విన్ మాట్లాడుతూ ‘కలియుగంలో ఏం జరుగుతుంది, ఏం జరగొచ్చు లాంటి అన్నిటికీ క్లైమాక్స్‌నే ఈ కథ. ప్రపంచంలోని అందరూ రిలేట్ అయ్యేలా ఉంటుంది. చిన్నప్పటి నుంచి నాకు పౌరాణిక చిత్రాలంటే ఇష్టం.
‘స్టార్ వార్స్’ లాంటి హాలీవుడ్ చిత్రాలు చూసి నచ్చినా, అవి మన కథలు కావు అనిపించేది. మహాభారతంలో ఎన్నో గొప్ప పాత్రలున్నాయి. కృష్ణావతారం ముగింపు నుంచి కలియుగం మొదలైనప్పుడు ఎలా ఉండబోతోంది అనే పూర్తి ఊహాజనిత అంశాలతో ఈ కథ రాసుకున్నా. మనం చదివిన పురాణాలకు ఓ క్లైమాక్స్‌లా ఉంటుంది. అలాగే ప్రతి యుగంలోనూ కలి పురుషుడు రావణాసుర, దుర్యోధన లాంటి దుష్ట రూపంలో కనిపిస్తాడు.
కలియుగంలోనూ ఓ అల్టిమేట్ రూపం ఉండి, అతనితో పోరాటం ఎలా ఉంటుందనే ఐడియాతో ఈ కథ రాసేందుకు ఐదేళ్లు పట్టింది. ఈ సరికొత్త సైన్స్ ఫిక్షన్ మైథాలజీ అటెంప్ట్‌ను చూసి ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో అని ఎదురుచూస్తున్నా’ అన్నాడు. జూన్ 27 న సినిమా విడుదల కానుంది.
