ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వేధిస్తుండు

ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వేధిస్తుండు
  • ​​​​​​ఎమ్మెల్యేను మేమెందుకు చంపాలనుకుంటం?
  • రూ.20 లక్షలు అప్పు చేసి గ్రామాన్ని అభివృద్ధి చేశా
  • సర్పంచ్ పై ఎమ్మెల్యే అక్కసు... బిల్లులు రాకుండా వేధింపులు
  • భర్తపై హత్యాయత్న కేసు పెట్టిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
  • కల్లెడ గ్రామ సస్పెండెడ్ సర్పంచ్ లావణ్య గౌడ్ ఆవేదన

ఆర్మూర్: తన భర్త ప్రసాద్ గౌడ్ ను కావాలనే హత్య కేసులో ఇరికించారని మక్లూర్ మండలంలోని కల్లెడ గ్రామ సర్పంచ్ లావణ్య ఆరోపించారు. రెండేళ్లుగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తమను వేధిస్తున్నారని ఆమె తెలిపారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని హత్య చేయడానికి ప్రసాద్ గౌడ్ కుట్ర పన్నాడని బంజరాహిల్స్ పోలీసులు ప్రసాద్ గౌడ్ ను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో  ప్రసాద్ గౌడ్ భార్య ,  సస్పెండెడ్ సర్పంచ్ లావణ్య మీడియాతో మాట్లాడారు. 

తన భర్తను ఇంటికి రమ్మని పిలిచి కేసులో ఇరికించారని తెలిపారు. రూ.20 లక్షలు అప్పు తెచ్చి గ్రామాభివృద్ధికి ఖర్చు చేశానని, ఆ డబ్బులకు నెలకి రూ.50 వేలు ఇంట్రెస్ట్ కడుతున్నట్లు ఆమె చెప్పారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు రాకపోవడంతో ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని కలిశామన్న ఆమె... ఎమ్మెల్యే సూచనతో కలెక్టర్, డీపీవోను కలిసి తమ సమస్యను వివరించినట్లు వెల్లడించారు. అయితే ఎవరికి చెప్పిన తమ బిల్లులు మాత్రం రాలేదని, ఇదే విషయమై ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి పలుమార్లు కంప్లైంట్ చేశామన్నారు. సమస్యను తీర్చాల్సిన ఎమ్మెల్యే తమపై కక్ష్యను పెంచుకున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే తనను సస్పెండ్ చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గ్రామంలో తమకు వ్యతిరేక వర్గాన్ని ఏర్పాటు చేశారన్నారు. 

తాజాగా ఇంటికి రమ్మని పిలిచి తన భర్తపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని హత్య చేయాల్సిన అవసరం తమకేముంటుందని ప్రశ్నించారు. రెండు నెలల దాకా తన భర్త  జైలు నుంచి రాడని చెబుతున్నారని, డాడీ ఎప్పుడొస్తారని పిల్లలు అడుగుతున్నారని కన్నీటిపర్యంతమయ్యారు. టైంకి టాబ్లెట్స్ ఇవ్వకపోతే తన భర్త ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పిన లావణ్య... తన భర్తపై పెట్టిన అక్రమ కేసును వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని కోరారు.