- పెనాల్టీ లేకుండా సీటు వదులుకునే చాన్స్
- నేటి సాయంత్రం 5 గంటల వరకే గడువు
- కాళోజీ హెల్త్ వర్సిటీ ప్రకటన
హైదరాబాద్, వెలుగు: ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోటాలో సీట్లు పొందిన విద్యార్థులకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఫ్రీ ఎగ్జిట్ అవకాశం కల్పించింది. 2026–-27 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండో విడత కౌన్సెలింగ్ వరకు సీట్లు పొందిన అభ్యర్థులు ఎలాంటి పెనాల్టీ లేకుండా సీటు వదులుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు వర్సిటీ రిజిస్ట్రార్ నోటిఫికేషన్ జారీ చేశారు.
సీటు రద్దు చేసుకోవాలనుకునే విద్యార్థులు సంబంధిత కాలేజీ ప్రిన్సిపాల్కు దరఖాస్తు చేసుకోవాలని, బుధవారం సాయంత్రం 5 గంటలలోపు ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. వర్సిటీ అనుబంధ మెడికల్ కాలేజీలతో పాటు అనురాగ్ వర్సిటీ పరిధిలోని నీలిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో సీట్లు పొందిన వారికి ఈ అవకాశం వర్తిస్తుంది.
ఫ్రీ ఎగ్జిట్ కింద సీటు రద్దు చేసుకున్న విద్యార్థులు ఈ విద్యా సంవత్సరంలో మేనేజ్మెంట్ కోటా తదుపరి విడత కౌన్సెలింగ్లో పాల్గొనేందుకు అర్హులు కాదని స్పష్టం చేసింది. గడువు తర్వాత సీటు వదులుకుంటే నిబంధనల ప్రకారం పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.
ఫ్రీ ఎగ్జిట్ గడువు తర్వాత జరిగే మాప్అప్ రౌండ్లో మేనేజ్మెంట్ కోటా నుంచి కన్వీనర్ కోటాకు అప్గ్రేడ్ అయ్యే విద్యార్థులకు పెనాల్టీ ఉండదని వర్సిటీ పేర్కొంది. ఫ్రీ ఎగ్జిట్ ఎంచుకున్న విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు, చెల్లించిన పూర్తి ఫీజును వెంటనే వెనక్కి ఇవ్వాలని కాలేజీల ప్రిన్సిపాళ్లను ఆదేశించింది. దీనికి సంబంధించిన వివరాలను బుధవారం సాయంత్రం 5.30 గంటలలోపు అడ్మిషన్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని స్పష్టం చేసింది.
