కరీంనగర్ చరిత్ర ప్రపంచానికి తెలిసేలా కళోత్సవాలు

కరీంనగర్ చరిత్ర ప్రపంచానికి తెలిసేలా కళోత్సవాలు

కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ చరిత్ర ప్రపంచానికి తెలిసేలా ఈనెల 30 నుంచి అక్టోబర్ 2వరకు కరీంనగర్ కళోత్సవాలు ఘనంగా నిర్వహించుకుందామని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బుధవారం స్థానిక అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మేయర్ సునీల్ రావుతో కలిసి మంత్రి గంగుల పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పీవీ, సినారె, మిద్దెరాములు లాంటి ఎందరో కళాకారులకు కరీంనగర్ పుటినిల్లు అని అన్నారు. వారందరినీ స్మరించుకునేలా తెలంగాణ, ఆంద్రప్రదేశ్ తో పాటు 20 రాష్ట్రాలకు చెందిన కళాకారులతో మూడ్రోజుల పాటు కళోత్సవాలు జరుపుకుందామన్నారు. శుక్రవారం మినిస్టర్ కేటీఆర్ చేతులమీదుగా ఉత్సవాలు ప్రారంభమవుతాయని, డెయిలీ సాయంత్రం 5గం.నుంచి కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. 

రాజకీయాలకతీతంగా అందరికీ వేదిక అయ్యేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నామని చెప్పారు. ఇండోనేషియా, ఇజ్రాయిల్, మలేషియా, అండమాన్ నికోబార్ కు చెందిన కళాకారులు పాల్గొంటారన్నారు. కళాకారులతో ఫస్ట్ డే స్థానిక తెలంగాణ చౌక్ నుంచి శోభాయాత్ర నిర్వహిస్తామన్నారు.  మేయర్​మాట్లాడుతూ మంత్రి కమలాకర్ ఆలోచనలతో ఉమ్మడి జిల్లాకు చెందిన సింగరేణి, కాళేశ్వరం, సిరిసిల్ల, వేములవాడ తో పాటు తెలంగాణ వచ్చుడో....కేసీఆర్ చచ్చుడో అని కేసీఆర్ దీక్షకు కూర్చున్న నాటి సందర్భాన్ని గుర్తుచేస్తూ రూపొందించిన ప్రత్యేక పాట ఆకర్షణగా నిలువనున్నాయన్నారు. కార్యక్రమంలో ఒలింపిక్ ఆసోసియేషన్ ప్రెసిడెంట్ నందెళ్లి మహిపాల్, ఏసీపీలు తులా శ్రీనివాస్ రావు, విజయ్ కుమార్, శ్రీనివాస్ పాల్గొన్నారు.