కేంద్రం నిధులివ్వడం లేదని ఇంకోసారి అంటే దవడ పళ్లు ఊడగొడుతా : ధర్మపురి అర్వింద్ ఫైర్‌‌‌‌

కేంద్రం నిధులివ్వడం లేదని ఇంకోసారి అంటే దవడ పళ్లు ఊడగొడుతా :  ధర్మపురి అర్వింద్ ఫైర్‌‌‌‌
  • కేంద్ర నిధులతోనే సిరిసిల్ల రింగ్‌‌ రోడ్డు పూర్తి
  • కాంగ్రెస్ బీ ఫామ్​లు కేసీఆర్ చేతుల్లో ఉన్నాయని కామెంట్

హైదరాబాద్, వెలుగు : తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నిధులివ్వడం లేదని మంత్రి కేటీఆర్ ఇంకోసారి విమర్శిస్తే.. ఆయన దవడ పళ్లు ఊడగొడతానంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ వార్నింగ్ ఇచ్చారు. కేంద్రం ఇచ్చిన రూ.వంద కోట్లతోనే కేటీఆర్ సిరిసిల్ల రింగ్ రోడ్డు వేసుకున్నారన్నారు. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ ప్రజల రక్తం పీల్చుకుంటూ బతుకుతుందని ధ్వజమెత్తారు. గురువారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. కేంద్రంపై విమర్శలు చేసే ముందు జాగ్రత్తగా ఉండకపోతే, నీ చరిత్ర ప్రజల ముందు ఉంచుతానని కేటీఆర్‌‌‌‌ను హెచ్చరించారు. కేటీఆర్‌‌‌‌ది నోరా.. మోరీనా.. అని దుయ్యబట్టారు. తన చెల్లి కవిత జైలుకు పోవాలని కేటీఆర్ కోరుకుంటున్నారన్నారు. ఆ కుటుంబం ముఖంపై నల్ల కాకి కూడా రెట్ట వేయటానికి ఇష్టపడదని విమర్శించారు. మెడికల్ కాలేజీల నిధుల విషయంలో హరీశ్‌‌ రావు సిగ్గులేకుండా అబద్ధాలు చెప్తున్నారని ధ్వజమెత్తారు. 

కేసీఆర్‌‌‌‌ ఆడమన్నట్లు రేవంత్‌‌ ఆడుతున్నడు..

ఉచిత విద్యుత్‌‌పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన కామెం ట్ల వెనక కేసీఆర్ ఉన్నారని అర్వింద్‌‌ ఆరోపించారు. 3 గంటల కరెంట్ చాలని రేవంత్‌‌కు ఏ రైతు చెప్పాడని నిలదీశారు. కేసీఆర్ ఆడిస్తే.. రేవంత్ ఆడుతున్నారన్నారు. కర్నాటక ఎన్నికల తర్వాత పీసీసీ చీఫ్‌‌కు కేసీఆర్ డబ్బులు పంపుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ బీ ఫాంలు సీఎం కేసీఆర్‌‌‌‌ నుంచే వెళ్తాయన్నారు. కవిత.. రేవంత్ ఇద్దరు బిజినెస్ పార్టనర్స్ అని ఆరోపించారు. 

అక్రమ క్వారీతో ప్రశాంత్‌‌ రెడ్డి వందల కోట్ల స్కామ్‌‌

మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రజల‌‌ సొత్తును దోచుకుంటున్నారని, ఆయన తన బ్రదర్స్‌‌తో కలసి బాల్కొండలో వందల కోట్ల స్కామ్‌‌కు పాల్పడుతున్నారని అర్వింద్‌‌ ఆరోపించారు. హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఆ నియోజకవర్గంలో కేవీ శ్రీకాంత్, వంశీరెడ్డి క్వారీ, క్రషర్స్ నడుపుతున్నారని, వీరి వెనుక ప్రశాంత్ రెడ్డి ఉన్నారన్నారు. 9,280 క్యూబిక్ మీటర్ల తవ్వకాలు జరిపేందుకు పర్మిషన్‌‌ ఉంటే.. 20 లక్షల క్యూబిక్ మీటర్లు తవ్వి అమ్ముకుంటున్నారన్నారు. ప్రశాంత్ రెడ్డి క్వారీ, క్రషర్లకు సంబంధించి విద్యుత్‌‌ శాఖకు రూ.51 లక్షల బకాయిలు చెల్లించాల్సి ఉందని, దీనిపై ఆ శాఖ మంత్రి జగదీశ్‌‌ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని అర్వింద్‌‌ నిలదీశారు. ప్రశాంత్ రెడ్డి క్వారీలు అటవీ ప్రాంతంలో ఉండడంతో దానిపై ఇన్స్‌‌స్పెక్షన్‌‌కు వెళ్లిన ఫారెస్టు అధికారిని 24 గంటల్లో బదిలీ చేశారన్నారు. ‘‘హాస్టళ్లలో పిల్లలకు పురుగుల అన్నం పెడుతున్నరు. ఆస్పత్రుల్లో డాక్టర్లు, నర్సులు ఉండరు. డెలివరీ కోసం వెళ్లే వారి కడుపులోనే కర్చీఫ్‌‌లు మర్చిపోయి కుట్లు వేస్తున్నరు. ప్రతి రంగం వారు ప్రభుత్వ తీరుతో అల్లాడిపోతున్నారు’’అని ఫైర్ అయ్యారు.