కార్మికులకు కేసీఆర్​ అండగా ఉంటారు

కార్మికులకు కేసీఆర్​ అండగా ఉంటారు
  • బీజేపీ సర్కారు అన్నీ అమ్మేస్తోంది
  • కేంద్రం కార్పొరేట్​ శక్తులకు తొత్తుగా మారింది : కవిత

కాజీపేట, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, బొగ్గు గనులు, రైలు పట్టాలను అమ్మేయాలని చూస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. బీజేపీ సర్కారు కార్పొరేట్​ శక్తులకు తొత్తుగా పనిచేస్తోందని, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ సంపన్నుల చేతుల్లో పెడుతోందని ఆరోపించారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడాన్ని అడ్డుకునేందుకు టీఆర్ఎస్​ కృషి చేస్తోందని చెప్పారు. ప్రభుత్వ చీఫ్​ విప్​ దాస్యం వినయ్​ భాస్కర్​ చేపట్టిన కార్మిక చైతన్య మాసోత్సవం ముగింపు సందర్భంగా మంగళవారం కాజీపేటలో ఏర్పాటు చేసిన కార్మిక ధర్మ యుద్ధం సభలో ఆమె  పాల్గొన్నారు.

కార్మికులకు కేసీఆర్​ అండగా ఉంటారు

మోడీకి ఫ్రెండ్​ అనే కారణంతోనే ఏడు ఎయిర్​ పోర్టులను అదానీకి కట్టబెట్టారని, అంతకుమించి ఆయనకు అర్హతేమీ లేదని కవిత అన్నారు. అసలు దేశానికి ప్రధాని మోడీ కాదని, అదానీ మాత్రమేననే చర్చ జరుగుతోందన్నారు. బీజేపీ ప్రభుత్వం నాలుగు చట్టాలను తీసుకొచ్చి కార్మికుల హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కొత్త చట్టాలను తెచ్చి రైతులను ఇబ్బంది పెట్టిందని, ఏడాది పోరాటం చేస్తే వాటిని వెనక్కి తీసుకుందని, అదే స్ఫూర్తితో కార్మికులు ఉద్యమించాల్సిన అవసరం ఉందని కవిత అన్నారు. ఈ పోరాటంలో సీఎం కేసీఆర్​ కార్మికులకు అండగా ఉంటారన్నారు. టీఆర్ఎస్​ ఎన్నికల్లో చెప్పిన ప్రతిమాటనూ నిజం చేస్తోందని, ఇండ్లు కట్టుకునేందుకు రూ.3 లక్షలు, దళితబంధు పేరుతో పేద ప్రజలను వ్యాపారులుగా మారుస్తోందని చెప్పారు.