ఆదిలాబాద్లో సమస్యలు ఎక్కువున్నయ్.. అక్కడి నుంచే పోటీ చేస్తా! : జాగృతి అధ్యక్షురాలు కవిత

ఆదిలాబాద్లో సమస్యలు ఎక్కువున్నయ్.. అక్కడి నుంచే పోటీ చేస్తా! : జాగృతి అధ్యక్షురాలు కవిత
  • జనం బాట తర్వాతే పార్టీ ఏర్పాటుపై నిర్ణయం: జాగృతి అధ్యక్షురాలు కవిత
  • సమస్యలు తెలుసుకునేందుకు కార్యాచరణ రూపొందించామని వెల్లడి
  • ఆదిలాబాద్​లో రెండో రోజు జనం బాట

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలో సమస్యలు ఎక్కువగా ఉన్నాయని.. ఇక్కడి సమస్యలు చూసి వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈ ప్రాంతం ఇంకా వెనకబడే ఉందని.. చెప్పుకో దగ్గ పరిశ్రమలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడి సమస్యలపై జాగృతిగా గట్టిగా పోరాడుతుందని, చట్టసభల్లో జిల్లా అభివృద్ధి గురించి మాట్లాడుతామన్నారు.

మార్చి, ఏప్రిల్ లో​పార్టీ పెడతారంటూ ప్రచారం జరుగుతున్నదని.. కానీ, ఇంకా ఆ విషయంలో నిర్ణయం తీసుకోలేదన్నారు. ఫిబ్రవరి 13 తర్వాత జనం బాట ముగుస్తుందని.. జనం బాట తర్వాతే పార్టీ పెట్టే అంశంపై నిర్ణయం తీసుకుంటామని ఆమె చెప్పారు. జాగృతి జనం బాటలో భాగంగా రెండో రోజు మంగళవారం ఆదిలాబాద్​ జిల్లాలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఆదిలాబాద్ లో పత్తి ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని చాలామంది చెప్పారని ఆమె పేర్కొన్నారు. 

‘చనాఖా’ అంచనా ఎందుకు పెరిగిందో బీఆర్​ఎస్ ​నేతలు చెప్పాలి..

ఆదిలాబాద్ జిల్లాలో చనాఖా కోరాటా ప్రాజెక్టు అంచనాలు రూ. 300 కోట్ల నుంచి రూ రూ.2 వేల కోట్లకు ఎందుకు పెరిగాయో బీఆర్ఎస్ నేతలు చెప్పాలని కవిత డిమాండ్​చేశారు. కుప్టీ ప్రాజెక్టులో తట్టెడు మట్టి కూడా తీయలేదన్నారు. ఆదిలాబాద్ లోని కుమ్రం భీం కాలనీలో వెయ్యి మంది ఆదివాసీలకు ఇండ్ల పటాలు ఇవ్వలేదు కానీ.. మావలలో 181 ఎకరాల ప్రభుత్వ భూమిని పెద్దవాళ్లకు అప్పగించారని ఆమె ఆరోపించారు. ఈ అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు.

 ‘‘రాముడి పేరుతో ఓట్లడిగే బీజేపీ నేతలు దేవుడి గుడి కోసం మాత్రం పనిచేయరు. జైనథ్ ఆలయానికి ఎంపీ నిధుల నుంచి రూ. 20 లక్షలు కేటాయించాలి”అని కవిత కోరారు. ఆ తర్వాత రిమ్స్ హాస్పిటల్ లో రోగులతో కవిత మాట్లాడారు. అనంతరం డిస్ట్రిక్ట్ సెంట్రల్ లైబ్రరీని సందర్శించి నిరుద్యోగులతో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని లైబ్రరీలలో మిడ్ డే మీల్స్ పెట్టాలని డిమాండ్ చేశారు.

అనంతరం జిల్లా కేంద్రంలో మేధావులు, విద్యావేత్తలతో సమావేశమయ్యారు. జాగృతిలో చేరేందుకు బీఆర్ఎస్ తో పాటు ఇతర పార్టీల నేతలు కూడా తమతో టచ్ లో ఉన్నారని.. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు నాలుగు నెలల కార్చాచరణ రూపొందించామని, తమ ఎజెండా నచ్చిన వారిని స్వాగతిస్తామని కవిత చెప్పారు. కేస్లాపూర్ నాగోబా ఆలయాన్ని కూడా ఆమె దర్శించుకున్నారు.