పెండ్లయి పిల్లలున్నవాళ్లకూ కల్యాణలక్ష్మి చెక్కులు

పెండ్లయి  పిల్లలున్నవాళ్లకూ కల్యాణలక్ష్మి చెక్కులు

మంచిర్యాల జిల్లాలో రూలింగ్​పార్టీ లీడర్ల నిర్వాకం

  •  కాసిపేటలో ఇటీవల ఐదుగురు అనర్హులకు చెక్కులు
  •     ఫిర్యాదు రావడంతో ఎంక్వైరీ చేస్తున్న ఆఫీసర్లు
  •     గతంలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్  జిల్లాల్లో కోట్లలో ఫ్రాడ్​ 

​మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలో కల్యాణలక్ష్మి స్కీం పక్కదారి పడుతోంది. ఎప్పుడో పెళ్లయి పిల్లలు ఉన్నోళ్లు కూడా కొత్తగా మ్యారేజ్​అయినట్టు సర్టిఫికెట్లు పెడ్తూ ప్రభుత్వం ఇచ్చే రూ.లక్ష కొట్టేస్తున్నారు. ఈ అక్రమాలను కొంతమంది ప్రజాప్రతినిధులు, లీడర్లు, అధికారులు ప్రోత్సహిస్తున్నారు. వచ్చిన పైసలను తలా కొంత పంచుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల కాసిపేట మండల కేంద్రానికి చెందిన పలువురికి కల్యాణలక్ష్మి చెక్కులు మంజూరయ్యాయి. వాటిని ఎమ్మెల్యే  లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ లిస్టులో ఐదారుగురు ఎప్పుడో పెళ్లయి..ఒకరిద్దరు పిలల్లున్నవారి పేర్లు కూడా ఉన్నాయి. దాంతో ఎమ్మెల్యే నుంచి వారి చెక్కులను ఒక ప్రజాప్రతినిధి తీసుకొని మరుసటి రోజు అందజేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఆఫీసర్లు తప్పు దిద్దుకునే పనిలో పడ్డారు. అనర్హులకు కల్యాణలక్ష్మి చెక్కులు మంజూరు కావడంపై ఎంక్వయిరీ చేస్తున్నామని చెప్తున్నారు. రెండు రోజుల్లో ఉన్నతాధికారులకు రిపోర్ట్​  అందజేస్తామని అంటున్నారు. 

ఆడబిడ్డల పెండ్లికి అండగా..   

పేదింటి ఆడబిడ్డల పెండ్లికి అండగా నిలిచేందుకు ప్రభుత్వం 2014 అక్టోబర్​2న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ స్కీంలను ప్రవేశపెట్టింది. మొదట్లో రూ.51వేలు అందించగా, 2017 మార్చి 13 నుంచి రూ.75,116కు పెంచింది. ఆ తర్వాత 2018 మార్చి నుంచి రూ.లక్షా 116, దివ్యాంగ యువతులకు రూ.లక్షా 25వేలు అందజేస్తోంది. ముస్లిం యువతుల వివాహానికి షాదీముబారక్​పేరిట ఆర్థికసాయం చేస్తోంది. ప్రభుత్వం సదుద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని కొంతమంది అక్రమార్కులు తమ స్వార్థానికి వాడుకుంటున్నారు. 

బోగస్​ లబ్ధిదారులు ఎందరు..?

కల్యాణలక్ష్మి పథకంలో మొదటి నుంచి అక్రమాలు చోటుచేసుకుంటున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఆదిలాబాద్ జిల్లాలో రూ.కోట్లలో ఫ్రాడ్​జరిగింది. డబ్బుల పంపిణీ విషయంలో విభేదాలు రావడంతో ఇచ్చోడలో ఓ వ్యక్తిని హత్య చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. తర్వాత కుమ్రం భీం ఆసిఫాబాద్​జిల్లాలోని తిర్యాణి మండలంలో ఇదే తరహా చీటింగ్ వెలుగుచూసింది. ఇందులో రెవెన్యూ అధికారులదే కీలకపాత్ర అని తేలింది. తాజాగా మంచిర్యాల జిల్లా కాసిపేటలో కల్యాణలక్ష్మి చెక్కులు పక్కదారి పట్టడం చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో ఈ అక్రమ వ్యవహారం ఎంతోకాలం నుంచి జరుగుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపిస్తే మరిన్ని అక్రమాలు బయటపడే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

  ప్రజాప్రతినిధులు, అధికారుల పాత్ర.. 

కల్యాణలక్ష్మి రూల్స్ పకడ్బందీగా ఉన్నప్పటికీ యథేచ్ఛగా అక్రమాలు జరుగుతుండడంతో ఇందులో ప్రజాప్రతినిధులు, అధికారుల పాత్ర  ఉంటుందన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే మీ సేవ ద్వారా లేటెస్ట్​గా జారీచేసిన పెళ్లికూతురు బర్త్, క్యాస్ట్, ఇన్​కమ్, రెసిడెన్షియల్​సర్టిఫికెట్లు, బ్యాంక్​అకౌంట్ బుక్ సమర్పించాలి. వివాహం చేసుకోబోయే యువతులకు 18 ఏండ్లు, యువకులకు 21 నిండాలి. పెళ్లికూతురు తల్లిదండ్రుల ఏడాది ఇన్​కమ్​ మున్సిపాలిటీల్లో రూ.2లక్షలు, పంచాయతీల పరిధిలో రూ.1.50 లక్షలు ఉండాలి. ఇద్దరి ఆధార్​కార్డులు, పెండ్లిపత్రికతో  పాటు యువతీ యువకులు మొదటిసారి పెండ్లి చేసుకుంటున్నట్టుగా ఫస్ట్​మ్యారేజ్​సర్టిఫికెట్​సమర్పించాల్సి ఉంటుంది. దానికి గెజిటెడ్​ఆఫీసర్ అటెస్టేషన్​తప్పనిసరి. వీటన్నింటిని జతచేసి మీ సేవలో దరఖాస్తు చేసుకుంటే రెవెన్యూ అధికారులు ఎంక్వయిరీ చేసి  అర్హులను ఎంపిక చేస్తారు. సర్టిఫికెట్ల జారీ మొదలు లబ్ధిదారుల ఎంపిక వరకూ ఇన్ని వడపోతలను దాటుకొని అక్రమాలకు పాల్పడుతున్నారంటే అధికారులు, ప్రజాప్రతినిధుల ప్రమేయం లేనిదే సాధ్యం కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి.