వేడుకలకు సమయం కాదిది.. దేశ భద్రత ముఖ్యం.. ఆ తర్వాతే సినిమా: కమల్ హాసన్‌

వేడుకలకు సమయం కాదిది.. దేశ భద్రత ముఖ్యం.. ఆ తర్వాతే సినిమా: కమల్ హాసన్‌

కమల్ హాసన్‌‌  హీరోగా  మణిరత్నం తెరకెక్కిస్తున్న చిత్రం ‘థగ్‌‌ లైఫ్‌‌’.శింబు కీలక పాత్ర పోషిస్తుండగా త్రిష, అభిరామి హీరోయిన్స్‌‌. జూన్ 5న సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. ఫస్ట్ సాంగ్‌‌ను రిలీజ్ చేయగా, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈనెల 16న భారీ స్థాయిలో ఆడియో లాంచ్ ఈవెంట్‌‌ను నిర్వహించాలని టీమ్ భావించింది.

అయితే ప్రస్తుతం దేశ సరిహద్దుల్లో ఏర్పడిన పరిస్థితుల నేపధ్యంలో ఈ వేడుకను వాయిదా వేసినట్లు కమల్ హాసన్ ఓ నోట్‌‌ను రిలీజ్ చేశారు.‘ఆర్ట్ కెన్ వెయిట్- ఇండియా కమ్స్ ఫస్ట్’ అనే స్టేట్‌‌మెంట్‌‌తో ‘మన దేశ సరిహద్దుల్లో చోటు చేసుకున్న పరిణామాలు, ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, మే 16న నిర్వహించాల్సిన థగ్ లైఫ్ ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నాం.

మన దేశాన్ని రక్షించడంలో మన సైనికులు  ధైర్యంతో ముందుండి పోరాడుతున్న వేళ ఇది. వేడుకలకు సమయం కాదని భావిస్తున్నాం. ఇది సంఘీభావానికి సమయమని నమ్ముతున్నా.  కొత్త తేదీని త్వరలోనే  ప్రకటిస్తాం’అని పోస్ట్ చేశారు. కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో 38 ఏళ్ల తర్వాత రాబోతున్న చిత్రం కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. ఏ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.