కామారెడ్డి టౌన్, వెలుగు : రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో తాగునీటి సరఫరాకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. గురువారం తాగునీటి సరఫరా, కంపోస్ట్ షెడ్ వాడకం. ఈజీఎస్, నర్సరీ, తోటల పెంపకం, జీపీ ఆస్తుల నిర్వహణ, ఇందిరమ్మ ఇండ్లు, పారిశుధ్యం, పన్ను వసూలు, ట్రాక్టర్ ఈఎంఐ చెల్లింపు తదితర అంశాలపై కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ అత్యవసర సేవలు, సందేహాలకు టోల్ ఫ్రీ నంబర్ 1916 కు కాల్ చేయాలని సూచించారు. పని చేయని మోటార్లు, పైప్ లైన్ లీకేజీలు, బ్రేక్ డౌన్ లను గుర్తించి మరమ్మతులు చేయాలని తెలిపారు.
తాగునీటి ట్యాంక్ లను శుభ్రం చేసి క్లోరినేషన్ చేయాలన్నారు. తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అవసరమైన చోట అద్దె బోర్లు తీసుకోవాలని, నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో మద్నూర్ మండలం జిల్లాలో మొదటి స్థానంలో ఉందన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ మదన్మోహన్ (లోకల్ బాడీ), ఆర్ డబ్ల్యూఎస్ ఎస్ఈ రాజేందర్ కుమార్, జడ్పీ సీఈవో చందన్ నాయక్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
