పోక్సో కేసులో నిందితుడికి 20 ఏండ్ల జైలు

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏండ్ల జైలు

కామారెడ్డి​, వెలుగు : పోక్సో కేసులో నిందితుడికి 20  ఏండ్ల జైలు శిక్ష, రూ. 60వేల జరిమానా విధిస్తూ కామారెడ్డి జిల్లా జడ్జి సీహెచ్ వీఆర్ఆర్ వరప్రసాద్​ బుధవారం తీర్పు ఇచ్చారు. ఎస్పీ రాజేశ్​ చంద్ర వివరాల ప్రకారం.. లింగంపేట మండలం గాంధీనగర్​కు చెందిన అక్కరేని శ్రీకాంత్ ముస్తాపూర్​లో  ట్రాక్టర్​ డ్రైవర్​గా పని చేసేవాడు.  అక్కడ ఓ 14 ఏండ్ల బాలికతో పరిచయం పెంచుకున్నాడు. మాయమాటలు చెప్పి  బైక్​పై మేడ్చల్​ జిల్లా డబిల్​పూర్ వద్దకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.  బాలిక కనిపించకపోవటంతో కుటుంబీకులు 7 జూలై 2022న లింగంపేట పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. 

ఈ విషయం తెలుసుకున్న శ్రీకాంత్ బాలికను 6 జూలై 2022న లింగంపేట పోలీస్​ స్టేషన్​ వద్ద వదిలి పారిపోగా, పోలీసులు దర్యాప్తు చేసి అరెస్ట్​ చేశారు. సరైన ఆధారాలతో బుధవారం కోర్టులో హాజరు పరిచారు. సాక్ష్యాలను పరిశీలించి శ్రీకాంత్​కు 20 ఏండ్ల జైలు శిక్ష,  రూ. 60వేల జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు.  పోలీసుల తరఫున పీపీ శేషు వాధించారు. ఎంక్వైరీ చేసి సాక్ష్యాలను కోర్టులో సమర్పించిన అప్పటి ఎల్లారెడ్డి డీఎస్పీ శశాంక్​రెడ్డి, ప్రస్తుత డీఎస్పీ శ్రీనివాస్​రావు, ఎస్సై, ఇతర సిబ్బందిని ఎస్పీ అభినందించారు.