కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో బాధితుల ఇండ్ల వద్దకే వెళ్లి పోలీసులు ఫిర్యాదులు స్వీకరించి బుధవారం మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ప్రజలకు మరింత సులభంగా, వేగంగా సేవలు అందించాలనే లక్ష్యంతో ఏదైనా ఘటన జరిగినట్లు సమాచారం అందగానే బాధితుల ఇళ్ల వద్దకే వెళ్లి ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసే విధానాన్ని పోలీస్ శాఖ ఇటీవల అమలులోకి తెచ్చింది. దీనిని విక్టిమ్ / సిటిజన్ సెంట్రిక్ పోలీసింగ్ విధానంగా పిలుస్తున్నారు. ఎస్పీ రాజేష్ చంద్ర వివరాల ప్రకారం.. గాంధారి పోలీస్ స్టేషన్ పరిధిలోని హేమ్లా నాయక్ తండాలో మంగళవారం రాత్రి 14 మేకలు దొంగతనానికి గురయ్యాయి. విషయం తెలిసిన వెంటనే ఎస్సై అంజనేయులు బాధితుడు కాంసోత్ మోహన్ ఇంటికి వెళ్లి ఫిర్యాదు స్వీకరించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
దోమకొండ మండల కేంద్రంలో మంగళవారం రాత్రి బీసు రుకుంబాయి, కిష్టయ్య దంపతులు ఇంట్లో ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో బెదిరించి బంగారు కమ్మలను అపహరించారు. ఈ ఘటనలో స్థానికులు ఒక దొంగను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో కూడా బాధితుల ఇంటి వద్దనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అదేవిధంగా లింగంపేట మండలం సజ్జనపల్లి–ఎక్కపల్లి మార్గంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఘటన స్థలంలోనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. బాధితుల గౌరవం, హక్కులను కాపాడుతూ వృత్తిపరమైన సేవలు అందించటమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని ఎస్పీ రాజేష్ చంద్ర పేర్కొన్నారు.
