భారత్ జోడో న్యాయ్ యాత్రలో .. ఎందుకు పాల్గొన్నానంటే..

భారత్ జోడో న్యాయ్ యాత్రలో .. ఎందుకు పాల్గొన్నానంటే..

 నేను 1970లలో మార్క్సిస్ట్‌‌గా నా సామాజిక, రాజకీయ  క్రియాశీలతను ప్రారంభించాను. ఆ తరువాత 1980లలో అంబేద్కరిజం వైపు మళ్లాను. నా జీవితంలో మొదటిసారిగా  నేను 17 మార్చి 2024న  ముంబై నగరంలో రాహుల్ గాంధీతో  కలిసి న్యాయ సంకల్ప్ పాదయాత్రను ప్రారంభించేందుకు.. మహాత్మా గాంధీ నివసించిన మణిభవన్‌‌కు వెళ్లాను.  మార్చి 16న సాయంత్రం న్యాయ యాత్ర అంబేద్కర్  చైత్యభూమికి చేరుకుంది.  

ముంబైలోని చైత్యభూమిలో వందలాది మంది సామాజిక కార్యకర్తలు రాహుల్‌‌తో  కలిసి రాజ్యాంగ ప్రవేశికను చదివి ప్రతిజ్ఞ చేశారు.  భారతదేశంలోని శూద్రులు/దళితులు, ఆదివాసీలందరికీ జీవం పోసిన రాజ్యాంగాన్ని పరిరక్షించే కార్యక్రమంలో నా మొదటి భాగస్వామ్యం కూడా అదే.  భారత రాజ్యాంగం ఉపోద్ఘాతంలోనే గొప్ప దృక్పథం ఉంది.  భారతదేశంలోని దళితులు/ఆదివాసీలు, శూద్రులు అని పిలుచుకునే అత్యంత దోపిడీ, అణచివేతకు గురైన మానవాళికి రాజ్యాంగం కొత్త జీవితాన్ని ఇచ్చింది.

ఇది 200 మిలియన్ల ముస్లింలకు పౌర సమాజంలో స్థిరమైన ప్రజాస్వామ్యం, లౌకిక జీవితంలో ఎలా జీవించాలో నేర్పిన రాజ్యాంగం. భారతదేశం వెలుపల ఉన్న ముస్లింలు ఈవిధమైన సాధారణ ఓటు ఆధారిత ప్రజాస్వామ్య జీవితాన్ని ఎన్నడూ అనుభవించలేదు.  ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించడం వారికి కూడా చాలా ముఖ్యం. హిందూత్వ సామూహిక జీవన చట్రం వెలుపల ఉన్న అగ్రవర్ణాలకు, ఈ రాజ్యాంగం ఆధునిక ప్రజాస్వామ్య జీవితాన్ని అందించింది.  ప్రస్తుత రాజ్యాంగ అనుకూల శక్తులన్నీ, వారి కులం, మతంతో సంబంధం లేకుండా దేశంలో సంపూర్ణ న్యాయం, సామాజిక న్యాయం కోసం ముందుకు సాగడానికి రాహుల్ గాంధీతో పాటు చైత్య భూమి, మణి భవన్  వద్ద  మార్చ్ చేయడానికి రాహుల్ గాంధీని కలిశాను. 

ప్రజాస్వామ్యంలో హిందూత్వ ఆధిపత్యం

హిందూత్వ ఆధిపత్యం నేపథ్యంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని నిలబెట్టుకోవడం కోసం తమ పోరాటంలో అంబేద్కర్, గాంధీ దార్శనికతతో  కాంగ్రెస్ చేసిన మొదటి పెద్ద ప్రయత్నం ఇది. స్వాతంత్ర్యం కోసం పోరాడిన పార్టీకి మద్దతుభారత రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి ఇది అవసరమైన సైద్ధాంతిక, తాత్విక కలయిక అని, ఈ చారిత్రాత్మక పోరాటంలో స్వాతంత్ర్యం కోసం పోరాడిన పార్టీకి మద్దతు ఇవ్వాలి అని నేను అనుకున్నాను. ఇది సుదీర్ఘమైన పోరాటం అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఢిల్లీలో అధికారంలో హిందూత్వ శక్తులు కొనసాగితే ఈ రాజ్యాంగాన్ని రూపుమాపుతాయన్న భయం చాలా వర్గాల ప్రజల్లో ఉంది.

 ఆర్ఎస్ఎస్ / బీజేపీ శక్తులు అంబేద్కర్, గాంధీని తమ సింబల్స్​గా ఉపయోగించుకున్నప్పటికీ,  భారతదేశంలో రాజ్యాంగ ప్రజాస్వామ్యం గురించి వారి దృక్పథాలను ఆమోదించలేదు. భారతీయ కమ్యూనిస్టులు శ్రామికవర్గ నియంతృత్వాన్ని నెలకొల్పాలనుకున్నప్పుడు వారు వర్ణధర్మ  డిక్టేటర్​షిప్​ స్థాపించాలనుకున్నారు. కాగా, అంబేద్కర్‌‌తో  కాంగ్రెస్‌‌కు విభేదాలు ఉన్నప్పటికీ.. వారు భారతదేశ చరిత్రలో చాలా క్లిష్ట సమయంలో ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రూపొందించడానికి అనుమతించారు. 

బ్రిటిష్ వలసవాదం ముగిసిన తర్వాత భారతదేశం అరాచక వ్యవస్థలోకి ప్రవేశిస్తుందని చాలామంది భావించారు. నాకు మహాత్మా గాంధీ, కాంగ్రెస్​తో సైద్ధాంతిక విభేదాలు ఉన్నప్పటికీ, సంపూర్ణ న్యాయం, సామాజిక న్యాయం కోసం నేను రాహుల్‌‌తో కలిసి పోరాటంలో పాల్గొన్నాను.  మనుగడ కోసం చేసే పోరాటంలో అన్ని తేడాలు అదృశ్యమవుతాయి.  కులగణన కోసం రాహుల్ పిలుపు సామాజిక న్యాయం ఆలోచనలో ఒక అంశం మాత్రమే. అయితే, ఇది ఒక కీలక ముందడుగు. భారతదేశంలో సామాజిక న్యాయం అనే ఆలోచన మొదటిసారి అంబేద్కర్ చేత రూపొందించబడింది. 

ఆ తరువాత వీపీ సింగ్ పాలనలో అది కచ్చితమైన అర్థాన్ని పొందింది. అది సామాజిక న్యాయం మండల్ దశ.  దాని ప్రకారం ఒక్కొక్కరు వారి వారి కుల సంఖ్య ప్రకారం.. జాతీయ సంపదను అన్ని కులాలు, అన్ని వర్గాలు వారి సంఖ్య ఆధారంగా పంచుకోవాలి. దళితులు/ఆదివాసీలు శూద్రులకు వర్ణధర్మం పూర్తి అన్యాయం చేసింది. అదే వర్ణ ధర్మాన్ని ఇప్పుడు హిందూత్వ శక్తులు సనాతన ధర్మంగా పిలుస్తున్నాయి.  

వర్ణధర్మ సిద్ధాంతాన్ని విమర్శించని మోదీ

ఆర్‌‌ఎస్‌‌ఎస్‌‌ను వర్ణ ధర్మ భావజాలానికి ప్రధాన ప్రతినిధిగా చూస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాను ‘అతిపెద్ద ఓబీసీ’ అని చెబుతున్నా కుల వ్యవస్థను సృష్టించిన వర్ణధర్మ సిద్ధాంతాన్ని ఆయన ఎప్పుడూ విమర్శించలేదు. గుత్తాధిపత్య రాజధానిలో దళితులు/ శూద్రులు, ఆదివాసీలకు వాటా ఇవ్వాలని ఆయన ఎప్పుడూ అడగలేదు. అదే సమయంలో ఆయన గుత్తాధిపత్య పెట్టుబడిదారులకు భారీగా సంపాదించుకోవడానికి సహాయం చేశాడు. సంపద మొత్తం కొద్దిమంది కార్పొరేట్ పెట్టుబడుదారుల వద్దే  పోగుపడుతుందని రాహుల్ గాంధీ విమర్శిస్తున్నారు. 

భారతీయ సమాజంలో  కుల విభజన ఉంది. న్యాయ్ యాత్రలో రాహుల్ ఆరు వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణించాడు. ఆయన  ప్రజానీకంలోని వివిధ వర్గాలతో సమావేశమై వారి కుల/వర్గ సమస్యలపై చర్చించాడు. సంకల్ప్ మీటింగ్​లో  నేను చేసిన చిన్న ప్రసంగంలో డా. బీఆర్.అంబేద్కర్, మహాత్మా గాంధీ ఆశయాలు సంక్షోభంలో ఉన్నాయని చెప్పాను. ఒకరు అణగారిన ప్రజానీకానికి జీవం పోసే దృక్పథంతో గొప్ప రాజ్యాంగాన్ని రచించారు. మరొకరు ఆధునిక ప్రజాస్వామ్య దేశానికి నైతిక పునాది వేశారు.

రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి

 రాజ్యాంగాన్ని, మన ప్రజాస్వామ్య వ్యవస్థలోని నైతిక ప్రాతిపదికను మనం రక్షించుకోవాలి.  మేము 2024 ఎన్నికల మధ్యలో కలుస్తున్నామని నేను చెప్పాను. అన్ని పౌర సామాజిక సంస్థలు రాజ్యాంగానికి ఓటు వేయడానికి కృషి చేయాలి. ప్రజాస్వామ్యానికి ఓటు వేయాలి. రాహుల్ గాంధీ న్యాయ యాత్ర చేపట్టి  రాజ్యాంగ వ్యతిరేక శక్తులతో పోరాడుతున్నారు. సంపూర్ణ న్యాయం, సామాజిక న్యాయం కోసం జరుగుతున్న పోరాటానికి రాహుల్ ప్రతీక. అందువల్ల దేశవ్యాప్తంగా  ప్రజా సంఘాల శక్తులు కూడా రాహుల్ గాంధీకి ఓటు వేయాలి అనే ఆలోచనతో ముందుకుసాగాలి. న్యాయం కోసం రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి స్పందిస్తూ లక్షలాది మంది ఈ పోరాటంలో పాల్గొంటున్నారు. 

అన్యాయానికి వ్యతిరేకంగా ఏదైనా చారిత్రక యుద్ధంలో నాయకత్వం వహించే వ్యక్తి ఆ ఉద్యమానికి చిహ్నంగా మారతాడు.  నా దృష్టిలో రాహుల్ గాంధీ ఆ గుర్తింపునకు అర్హుడు. ఇప్పుడు యుద్ధం కార్మిక శక్తి  వర్సెస్  దుష్ట శక్తి  మధ్య ఉంది. గాంధీ, నెహ్రూ, పటేల్‌‌ల పార్టీ నుంచి వచ్చిన రాహుల్‌‌.. ప్రస్తుత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌‌ను ఓన్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 

అంబేద్కర్ మరణానంతరం కాంగ్రెస్ ఆయన పాత్రను నిర్వీర్యం చేసింది.  ఆ విషయాన్ని రాహుల్ గాంధీ  గ్రహించినట్లు తెలుస్తోంది. అందుకే చైత్య భూమిలో రాజ్యాంగ ప్రవేశికను చదవాలనే ఆలోచన ఆయనకు వచ్చింది. రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కృషి, రచనలు చేస్తున్న యాక్టివిస్ట్​గా  నేను తప్పనిసరిగా ఉద్యమంలో పాల్గొన్ని నా సహాయ సహకారాలు అందించాలనుకుంటున్నాను.

- కంచ ఐలయ్య షెఫర్డ్, 
రాజకీయ సిద్ధాంతకర్త, సామాజిక కార్యకర్త, రచయిత