సికింద్రాబాద్, వెలుగు: ప్రత్యేక తెలంగాణ కోసం ప్రజాగాయకుడు గద్దర్చేసిన కృషి, ప్రజలను చైతన్యపరిచిన తీరు వెలకట్టలేనిదని ప్రొఫెసర్ కంచె ఐలయ్య అన్నారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘భావ ప్రకటన- – పాలకుల అణచివేత– గాయపడ్డ పాట’ పేరుతో సదస్సు నిర్వహించారు. ప్రొఫెసర్ కంచె ఐలయ్య పాల్గొని మాట్లాడారు. ఆటాపాటా చరిత్ర సృష్టికర్త గద్దర్ అన్నారు. వెన్నెముకలో తూటా పెట్టుకుని 20 ఏళ్లు బతికిన గొప్ప వీరుడు గద్దర్అని కొనియాడారు.
తెలగాణ ఉద్యమం గద్దర్తో మళ్లీ పుడుతుందనే భయంతో 1997లో ఆయనపై పోలీసులు కాల్పులు జరిపారన్నారు. సాయుధ పోరాటంలో పాడిన పాటలు ఒక దశ అయితే.. కారం చేడు ఘటనపై పాడిన పాటలు మరో దశ అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం గద్దర్ పేరు మీద అవార్డులు ఇస్తామని ప్రకటించడం మంచి పరిణామమన్నారు. అలాగే గద్దర్పేరిట ప్రజా కళల యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని కోరారు. రామమందిరం కంటే అధికంగా అంబేద్కర్ మందిరాలు కట్టాలని ఐలయ్య పిలుపునిచ్చారు.
అంబేద్కర్పోరాటాలు, రాసిన రాజ్యాంగాన్ని ప్రజలలోకి తీసుకుపోయిన గొప్ప వ్యక్తి గద్దర్అని అని కొనియాడారు. గద్దర్ ఫౌండేషన్సభ్యుడు డాక్టర్ సంగంరెడ్డి పృథ్విరాజ్ యాదవ్, గద్దర్కుమారుడు విఠల్సూర్యకిరణ్, గద్దర్ సతీమణి విమల, ప్రెస్అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ, రిటైర్డ్జస్టిస్ చంద్రకుమార్, అంబేద్కర్వాది జేబీ రాజు, సీనియర్జర్నలిస్ట్పాశం యాదగిరి, ప్రజా గాయకురాలు విమలక్క తదితరులు పాల్గొని మాట్లాడారు.
