
సంగారెడ్డి, వెలుగు: సదాశివపేట కందకం(ప్రభుత్వ స్థలాల) చుట్టూ పొలిటికల్ గేమ్ నడుస్తోంది. 65వ నేషనల్ హైవే పక్కన వందల కోట్ల విలువ చేసే ల్యాండ్స్ కబ్జాలకు గురయ్యాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్ లీడర్లు గత 12 ఏళ్లుగా కందకం చుట్టూ చక్రం తిప్పుతున్నారు. గ్రామాల రక్షణం కోసం అప్పట్లో వీటిని తవ్వేవారు. గ్రామంలోకి రాత్రివేళ ఇతర వ్యక్తులు రాకుండా, గ్రామంలోని పశువులు బయటకు వెళ్లకుండా ఈ కందకాలు ఉపయోగపడేవి. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపల్ పరిధిలోని పాత పట్టణం చుట్టూ లోతైన కందకం స్థలాలు ఉండేవి. పక్కనే 65వ నేషనల్ హైవే ఉండడంతో అక్కడ స్థలాలకు డిమాండ్ పెరిగింది. దీంతో కందకం స్థలాలు 2009 నుంచి ఆక్రమణలకు గురవుతూ వస్తున్నాయి. పాలకుల స్వార్థ రాజకీయాలకు తోడు ఆఫీసర్లు చూసీ చూడనట్టు ఉండడంతో ఆయా స్థలాలు గృహ, వ్యాపార, వాణిజ్య సంస్థలకు నిలయాలుగా మారాయి. తాజాగా టీఆర్ఎస్ లీడర్లు, పేట మున్సిపల్ కమిషనర్ స్పందన మధ్య విభేదాలు తలెత్తడంతో అప్పటి కందకం స్థలాల ఆక్రమణలు మళ్లీ తెరపైకి వచ్చాయి. కందకం స్థలాలను కబ్జా చేసిన కొందరు బడా నేతలకు, వ్యాపారులకు.. కమిషనర్ ఇటీవల నోటీసులు జారీ చేసి హడలెత్తించారు. అందుకే ఈ భూముల సీక్రెట్ బయటికి రానివ్వకుండా చేసేందుకు టీఆర్ఎస్ లీడర్లు కమిషనర్‌ను మరో చోటికి ట్రాన్స్ఫర్ చేయించారన్న ప్రచారం జరుగుతోంది.
వెనక్కి మళ్లిన రూ.22 కోట్లు
సదాశివపేట టౌన్ చుట్టూ కందకం స్థలాల్లో బైపాస్ రోడ్డు నిర్మించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందుకుగాను మూడు దఫాలుగా ఆర్అండ్ బీ ఫండ్స్ కింద రూ.24.5 కోట్లు మంజూరు చేసింది. 2007లో ఎమ్మెల్యేగా ఉన్న జగ్గారెడ్డి (కాంగ్రెస్) హయాంలో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం రూ.12 కోట్లు, ఆ తర్వాత 2015లో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్(టీఆర్ఎస్) టైంలో రూ.10 కోట్లు రిలీజ్ అయ్యాయి. 2016లో అదనంగా మరో రెండున్నర కోట్లు విడుదలయ్యాయి. కానీ కందకం స్థలాల కబ్జాల కారణంగా ఆ నిధులు బైపాస్ రోడ్డు కోసం ఖర్చు చేయలేకపోవడంతో వెనక్కి వెళ్లిపోయాయి. 2016 జూన్ 28న కందకం స్థలాల్లో రెండున్నర కిలోమీటర్ల దూరం బైపాస్ రోడ్డు వేసేందుకు శంకుస్థాపన చేశారు. అదనంగా వచ్చిన రూ.2.5 కోట్లతో కొంతమేరకు పనులు జరిగినా రాజకీయ జోక్యం కారణంగా అవీ మధ్యలోనే నిలిచిపోయాయి. ఇప్పటికైనా సర్కారు, జిల్లా ఆఫీసర్లు స్పందించి చర్యలు తీసుకోకపోతే కందకం స్థలాలు పూర్తిగా కబ్జా అయ్యే ప్రమాదముంది.
అమలవ్వని హైకోర్టు ఆదేశాలు
సదాశివపేట చుట్టూ ఉన్న వందల కోట్ల విలువైన కందకం స్థలాల ఆక్రమణలపై 12 ఏళ్ల కిందటే హైకోర్టు స్పందించింది. అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని, కందకం స్థలంలో తాత్కాలిక, శాశ్వత నిర్మాణాలకు పర్మిషన్ ఇవ్వకూడదని 2009లో మున్సిపల్ శాఖతో పాటు అప్పటి ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో అప్పటి ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్ 2010 జనవరి 28న నేషనల్ హైవేపై కందకం స్థలాలను ఆక్రమించిన వారికి కూల్చివేస్తామంటూ నోటీసులు ఇచ్చారు. ఆఫీసర్లు సైతం అప్పట్లో కూల్చివేతలపై పకడ్బందీగా చర్యలు చేపట్టినప్పటికీ కాంగ్రెస్, టీడీపీ(ప్రస్తుత టీఆర్ఎస్) లీడర్ల జోక్యంతో కూల్చివేతలు తాత్కాలికంగా ఆపేశారు. ఆ తర్వాత హైకోర్టు ఆదేశాలను మున్సిపల్ ఆఫీసర్లు పట్టించుకోలేదు. దాంతో 2010 నుంచి ఇప్పటివరకు నేషనల్ హైవేను ఆనుకొని ఉన్న కందకం స్థలాల్లో అక్రమ నిర్మాణాలు, పెద్ద పెద్ద బిల్డింగ్ లు కడుతూ వచ్చారు. ఇదిలా ఉంటే ప్రస్తుత టీఆర్ఎస్ లీడర్ ఒకరు అక్రమంగా వెంచర్లు చేసి ప్లాట్లను అమ్మి తమను మోసం చేశాడని బాధిత ప్రజలు లబోదిబోమంటున్నారు.
బడా బిల్డింగ్లకు నోటీసులు
కందకం స్థలాల కబ్జా వెనక రాజకీయ నేతలు ఉండడంతో 12 ఏళ్లుగా కమిషనర్ స్థాయి ఆఫీసర్లు చూసీ చూడనట్టు వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే తాజాగా మున్సిపల్ కమిషనర్ స్పందన పేటలో టీఆర్ఎస్ లీడర్ల అక్రమాలపై కొరడా ఝుళిపించడంతో కమిషనర్ ను కొందరు సెల్ ఫోన్ ద్వారా దూషించారు. మున్సిపల్ సిబ్బందిని బెదిరించి దాడులకు పాల్పడడం, మున్సిపల్ ఆఫీసులోని టౌన్ ప్లానింగ్ విభాగం గదికి తాళం వేసి సీజ్ చేయడం వంటి దౌర్జన్యాలకు పాల్పడ్డారు. అక్కడితో ఆగకుండా శానిటరీ ఇన్స్పెక్టర్ను అసభ్యంగా దూషించి, బెదిరించారు. దాంతో ఆగ్రహించిన కమిషనర్ స్పందన మున్సిపల్ మీటింగ్‌లో టీఆర్ఎస్ లీడర్ల దౌర్జన్యాలపై మండిపడ్డారు. అప్పటి నుంచి టీఆర్ఎస్ లీడర్లు చేస్తున్న అవినీతి, అక్రమాలపై పోరాడుతూ కందకం స్థలాల కబ్జాలపై హైకోర్టు ఉత్తర్వులను అమలు చేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే నేషనల్ హైవే పక్కన ఉన్న స్థలంలో కబ్జా చేసిన బడా బిల్డింగ్లకు నోటీసులు జారీ చేసి భవన సముదాయాలను సీజ్ చేయడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.