
ముంబై: బాలీవుడ్ టాప్ హీరోయిన్ కంగనా రనౌత్ అకౌంట్‌ను రీసెంట్‌గా ట్విట్టర్ తొలగించింది. తమ రూల్స్‌కు విరుద్ధంగా పోస్టులు పెట్టారని ఆమె అకౌంట్‌ను శాశ్వతంగా తొలగించారు. ఈ క్రమంలో మరో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కంగన యాక్టివ్‌గా ఉంటోంది. అయితే ఇప్పుడు అక్కడా ఆమె నిషేధం ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈమధ్యే కరోనా బారిన పడ్డ కంగన.. వైరస్ ఓ చిన్న ఫ్లూ మాత్రమేనని ఇన్‌స్టాలో ఒక పోస్టు పెట్టింది. కరోనాను నాశనం చేస్తానని రాసింది. అయితే ఈ పోస్టును ఇన్‌స్టా డిలీట్ చేయడం వివాదాస్పదం అవుతోంది. ఈ విషయంపై కంగన సీరియస్ అయ్యింది. ఇన్‌స్టాగ్రామ్ తన అకౌంట్‌ను ఎప్పుడెప్పుడు తొలగిస్తుందా అని ఎదురు చూస్తున్నానని, తాను ప్రశ్నించడం మాత్రం ఆపబోనని ఈ ఫైర్ బ్రాండ్ స్పష్టం చేసింది.
‘కరోనాను అంతం చేస్తానని నేను చేసిన పోస్టుకు కొందరు హర్ట్ అయినట్లున్నారు. అందుకే ఆ పోస్టును ఇన్‌స్టాగ్రామ్ తొలగించింది. టెర్రరిస్టులు, కమ్యూనిస్టులకు సానుభూతిపరులు ఉంటారని ట్విట్టర్ ద్వారా తెలుసుకున్నా. కానీ కొవిడ్‌కు ఫ్యాన్ క్లబ్ ఉండటమేంటో? నాకు ఆశ్చర్యమేసింది. ఇన్‌స్టాలోకి వచ్చి రెండ్రోజులు అయ్యింది. ఇక్కడ ఓ వారం కంటే ఎక్కువ రోజులు ఉండటం కష్టమే అనుకుంటా’ అని నవ్వుతున్న ఎమోజీలతో కంగన పోస్టు చేసింది.