పోలీసులను విమర్శిస్తే ఊరుకోబోం.. కంగనాకు ఎంఎన్ఎస్ హెచ్చరిక

పోలీసులను విమర్శిస్తే ఊరుకోబోం.. కంగనాకు ఎంఎన్ఎస్ హెచ్చరిక

ముంబై: ముంబై పీవోకేలా కనిపిస్తోందని బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ చేసిన కామెంట్స్ పై వివాదం రేగుతోంది. శివ సేన ఎంపీ సంజయ్ రౌత్ తనను ముంబైకి రావొద్దని చెప్పిన నేపథ్యంలో బొంబాయి తనకు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లా కనిపిస్తోందని కంగనా జవాబిచ్చింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. బాలీవుడ్ డ్రగ్ మాఫియా గురించి పలుమార్లు స్టేట్ మెంట్స్ ఇవ్వడంతో ముంబై పోలీసులు తనను మాట్లాడకుండా చేయాలని యత్నించారని కంగనా ఆరోపించింది. ముంబై పోలీసులపై వ్యతిరేకంగా మాట్లాడినందుకు కంగనాపై మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) విరుచుకుపడింది. మరోమారు ముంబై పోలీసులను విమర్శిస్తే ఊరుకోబోమని కంగనాను హెచ్చరించింది. మరోవైపు కంగనా వెనుక బీజేపీ ఐటీ సెల్ పని చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది.

కంగనాకు అండగా బీజేపీ ఉందని మరాఠీ యాక్టర్ రేణుకా షహానే, బాలీవుడ్ వెటరన్ హీరోయిన్, కాంగ్రెస్ నేత ఊర్మిలా మతోండ్కర్ దుయ్యబట్టారు. ‘ఇవ్వాళ ముంబై ఇంత సురక్షితంగా ఉందంటే దానికి ముంబై పోలీసులే కారణం. ఈ సిటీలో మహిళలు అర్ధ రాత్రి కూడా నిర్భయంగా ప్రయాణించొచ్చు. ముంబై పోలీసులపై ఎవరైనా అన్యాయంగా విమర్శలు చేయడాన్ని అనుమతించబోం. ఈ ఘనటలో కంగనా కేవలం ఒక ముఖం మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వానికి హాని కలిగించేలా మొత్తం తతంగాన్ని బీజేపీ ఐటీ సెల్ వెనుక నుంచి నడిపిస్తోంది’ అని ఎంఎన్ఎస్ ఫిల్మ్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ అమేయా ఖోప్కార్ మండిపడ్డారు.