
తెలుగు సినీ ఇండస్ట్రీలో బయోపిక్ ల పరంపర కొనసాగుతోంది. ఇప్పుడు మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు మొదలవుతోంది. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, నిరాడంబరతకు, నిజాయితీకి ప్రతీకగా నిలిచిన గుమ్మడి నర్సయ్య జీవిత కథను వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. ఈ పవర్‌ఫుల్ పాత్రలో కన్నడ కరుణాడ చక్రవర్తి, సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ నటించబోతుండటం ఈ ప్రాజెక్ట్‌కే హైలైట్ గా నిలిచింది.
శివన్న తెలుగు అరంగేట్రం!
దక్షిణాదిలో అత్యంత బిజీ నటులలో ఒకరైన శివ రాజ్‌కుమార్... ఈ బయోపిక్‌తోనే తెలుగులో హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రం పాన్-ఇండియన్ స్థాయిలో విడుదల కానుంది. ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎన్. సురేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి, కొత్త దర్శకుడు పరమేశ్వర్ హివ్రేల్ దర్శకత్వం వహించనున్నారు. నిర్మాణ సంస్థ విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్ సినిమా స్థాయిని చాటి చెప్పింది.
ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్..
ఆఫ్-వైట్ కుర్తా పైజామా, ఎరుపు కండువాతో శివ రాజ్‌కుమార్ కనిపిస్తున్నారు. ఆయన సైకిల్‌ను నడుచుకుంటూ తీసుకెళ్తున్నారు. ఆ సైకిల్ హ్యాండిల్‌కు సీపీఐ (ఎంఎల్) జెండా రెపరెపలాడుతోంది. అసాధారణమైన, స్ఫూర్తిదాయకమైన ప్రయాణానికి శక్తివంతమైన మెరుపు అంటూ ఈ పోస్టర్‌కు క్యాప్షన్ ఇవ్వడం జరిగింది. దర్శకుడు పరమేశ్వర్ హివ్రేల్ పోస్ట్ చేసిన అనౌన్స్‌మెంట్ వీడియోలో... భారత రాజ్యాంగం, డా. బీ.ఆర్. అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహాల దృశ్యాలతో పాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభ (Assembly) భవనాన్ని చూపించడం ద్వారా గుమ్మడి నర్సయ్య రాజకీయ జీవితంలోని లోతైన సిద్ధాంతాల నేపథ్యాన్ని స్పష్టం చేశారు.
నిరాడంబరతకు నిలువెత్తు రూపం..
తెలంగాణలోని ఇల్లందుకు చెందిన గుమ్మడి నర్సయ్య ఒక రాజకీయ నాయకుడిగానే కాక, సామాజిక కార్యకర్తగానూ నాలుగు దశాబ్దాలకు పైగా ఎంతో గౌరవాన్ని పొందారు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) తరఫున ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా... ఆయన జీవనం ఎంతో నిరాడంబరం. అధికారం, విలాసాలకు దూరంగా, కేవలం సైకిల్‌పైనే అసెంబ్లీకి వెళ్లడం, తన నియోజకవర్గ ప్రజలతో నేరుగా మమేకం కావడం ఆయన ప్రత్యేకత. నిస్వార్థ సేవ, గిరిజన, శ్రామిక వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన అలుపెరగని పోరాటం... నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నేటి తెలంగాణ రాజకీయాల్లో ఆయన్ని ఒక శాశ్వతమైన ఆదర్శమూర్తిగా నిలబెట్టింది. అంతేకాకుండా, నర్సయ్యఈ సినిమా అభివృద్ధిలో చురుకైన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. దర్శకుడి అనౌన్స్‌మెంట్ వీడియోలో స్వయంగా ఆయన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ట్యాగ్ చేయడం విశేషం.
ప్రస్తుతం ఈ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. మరోవైపు, శివ రాజ్‌కుమార్ ఇప్పటికే తెలుగులో రాబోయే రామ్ చరణ్ 'పెద్ది' చిత్రంలో, రజనీకాంత్ 'జైలర్ 2'లో కీలక అతిథి పాత్రలు పోషిస్తున్నారు. ఆయన కన్నడలో '45', 'డాడ్', '666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్' వంటి పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.