
- 5 గంటల హైడ్రామా.. అడ్డుకున్న అధికారులు
లింగంపేట, వెలుగు: మండలంలోని కన్నాపూర్ గ్రామ మహిళలు ఆదివారం అడవిని నరకడానికి యత్నించారు. చెరువు తెగిపోవడం, రోడ్డు బ్రిడ్జి కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయని, ప్రాణభయం ఉందని, అడవిలో గుడిసెలు వేసుకుంటామని పట్టుబట్టారు. విషయం తెలుసుకున్న నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, మాచారెడ్డి రేంజ్ పరిధిలోని అటవీ సిబ్బంది అక్కడికి చేరుకుని చెట్ల నరికివేతను అడ్డుకున్నారు.
దీంతో మహిళలు ఫారెస్ట్ సిబ్బందికి ఘర్షణ జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు, మండల పరిషత్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మహిళలను సముదాయించే ప్రయత్నం చేశారు. చెరువు, రోడ్డు తెగిపోయినా ఎవరూ పట్టించుకోలేదని, ఆ ఊరిలో ఉండలేమని, గ్రామ బస్టాండ్ దగ్గరే ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగిన ఈ హైడ్రామాలో ఎంపీడీవో నరేశ్, నాగిరెడ్డిపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వాసు, తహసీల్దార్ సురేశ్తదితర అధికారులు మహిళలతో చర్చించారు. అడవిని నరికితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. చివరకు జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి రెవెన్యూ భూమిని కేటాయిస్తామని తహసీల్దార్ హామీ ఇవ్వడంతో మహిళలు గ్రామానికి వెళ్లిపోయారు. ఈ విషయంపై దర్యాప్తు చేస్తామని ఫారెస్ట్రేంజ్ ఆఫీసర్ వాసు తెలిపారు.