రిపేర్‌‌‌‌ ఖర్చులు భరించేది ప్రభుత్వమా.. మేఘా కంపెనీయా?

రిపేర్‌‌‌‌ ఖర్చులు భరించేది ప్రభుత్వమా.. మేఘా కంపెనీయా?
  • రూ. 400 కోట్లకు పైగా ఖర్చు అయితదంటున్న ఇంజినీర్లు
  • మూడేండ్లకే పగిలిన ఫోర్‌‌‌‌ బేస్​మెంట్‌‌‌‌ గోడలు
  • నాసిరకం పనులతో మునిగిన 680 కోట్ల విలువైన 17 బాహుబలి మోటార్లు
  • ఆర్నెల్ల పాటు ఆగనున్న పంపింగ్‌‌‌‌.. విదేశీ ఇంజినీర్లతోనే మోటార్ల రిపేర్‌‌‌‌
  • రూ. 400 కోట్లకు పైగా ఖర్చు అయితదంటున్న ఇంజినీర్లు
  • రిపేర్‌‌‌‌ ఖర్చులు భరించేది ప్రభుత్వమా.. మేఘా కంపెనీయా?
  • తేల్చని నీటిపారుదల శాఖ ఆఫీసర్లు

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి/ మహాదేవ్‌‌‌‌పూర్‌‌‌‌, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి, అన్నారం పంపుహౌస్​లు గురువారం వరద గోదావరిలో మునిగిపోవడం వెనుక అసలు కారణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అన్నారం పంపుహౌస్​ మునిగేందుకు కారణాలు స్పష్టంగా తెలియరాకున్నా కన్నెపల్లి పంప్‌‌‌‌హౌస్​ పనులు చేపట్టిన మేఘా కంపెనీ తప్పిదాల వల్లే నీట మునిగిందని ఇంజినీర్లు చెప్తున్నారు. పంపుహౌస్​కు రక్షణగా వందల ఏండ్ల పాటు ఉండాల్సిన ఫోర్‌‌‌‌ బేస్​మెంట్​ గోడ మూడేండ్లకే పగలడం వల్ల పంప్‌‌‌‌హౌస్​లోకి నీళ్లు చేరాయి. దీంతో రూ. 680 కోట్ల విలువ చేసే 17 బాహుబలి మోటార్లు నీటిలో మునిగిపోయాయి. రూ. వందల కోట్ల విలువ చేసే పంపింగ్‌‌‌‌, ఎలక్ట్రిక్​ సామగ్రి నీళ్లపాలయ్యాయి. విదేశాల నుంచి వచ్చే ఇంజనీర్లే ఈ మోటార్లను రిపేర్​ చేయాల్సి ఉందని, ఇందుకు ఎంత లేదన్నా 6 నెలలు పడ్తుందని ఇరిగేషన్​ ఉన్నతాధికారులు అంటున్నారు. దీంతో ఈ ఏడాదీ కన్నెపల్లి పంప్‌‌‌‌హౌస్​  వద్ద నీటి పంపింగ్‌‌‌‌ ఆగినట్లేనని చెప్తున్నారు.

పగిలిన ఫోర్‌‌‌‌ బేస్​మెంట్  గోడ

గోదావరి తీరం నుంచి 500 మీటర్ల దూరంలో రూ.2,827 కోట్లతో కన్నెపల్లి పంప్‌‌‌‌హౌస్​  నిర్మించారు. మేఘా సంస్థ ఈ పనులు చేపట్టింది. 150 మీటర్ల వెడల్పుతో పంప్‌‌‌‌హౌస్​ కట్టారు. రోజుకు 3 టీఎంసీల నీళ్లను లిఫ్ట్‌‌‌‌ చేసేలా రూ. 680 కోట్ల ఫండ్స్​తో విదేశాల నుంచి తెప్పించిన17 మోటార్లను బిగించారు. నదీతీరంలో వరద తాకిడిని తట్టుకునే విధంగా ప్రొటెక్షన్‌‌‌‌ వాల్‌‌‌‌ కట్టారు. వాటర్‌‌‌‌ పంపింగ్‌‌‌‌ చేసే సమయంలో ఈ హెడ్‌‌‌‌ రెగ్యులరేటర్‌‌‌‌ గేట్లను తెరిస్తే ఫోర్‌‌‌‌బేలోకి గోదావరి నీళ్లు వస్తాయి. ఫోర్‌‌‌‌బేలో 93.5 మీటర్ల హైట్‌‌‌‌లో  నీళ్లు ఉంటేనే మోటార్లను ఆన్‌‌‌‌ చేసి లిఫ్టింగ్‌‌‌‌ స్టార్ట్‌‌‌‌ చేయొచ్చు. 110 మీటర్ల హైట్‌‌‌‌తో ఫోర్‌‌‌‌ బే గోడలు నిర్మించారు. ఫోర్‌‌‌‌ బే అడుగు భాగంలో మోటార్లకు నీళ్లు వెళ్లడానికి వీలుగా స్టాప్‌‌‌‌ లాక్‌‌‌‌ గేట్లను కింద అమర్చారు. మోటార్లకు రక్షణగా ఫోర్‌‌‌‌ బే గోడను సిమెంట్‌‌‌‌ కాంక్రీట్‌‌‌‌తో నిర్మించారు. గురువారం మధ్యాహ్నం మోటార్లకు రక్షణగా కట్టిన ఫోర్‌‌‌‌ బేస్​మెంట్​ గోడ నీటి ఒత్తిడికి పగిలిపోయింది. దీంతో నీళ్లు పంప్‌‌‌‌హౌస్​లోకి చేరి 17 మోటార్లను ‌‌ ముంచెత్తాయి. కాంట్రాక్ట్‌‌‌‌ సంస్థ ఈ సిమెంట్‌‌‌‌ గోడను నాసిరకంగా కట్టడం వల్లనే కేవలం మూడేండ్లకే పగిలిపోయినట్లు నిపుణులు చెప్తున్నారు. గతంలో హెడ్‌‌‌‌ రెగ్యులరేటర్‌‌‌‌ దగ్గర గేట్ల లీకేజీలు , కన్నెపల్లి పంప్‌‌‌‌హౌస్​ వద్ద ప్రొటెక్షన్‌‌‌‌ వాల్‌‌‌‌ బాగాలేదని పెద్దాఫీసర్లు హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో వందల కోట్ల నష్టం వాటిల్లింది.

గోడ పగిలింది స్పష్టంగా కనిపిస్తున్నా..!

మేఘా ప్రతినిధులు, ఇంజినీర్లు కలిసి తమ తప్పును బయటపడకుండా గోదావరి వరదల వల్లే కన్నెపల్లి పంప్‌‌‌‌హౌస్​ మునిగినట్లు ప్రచారం చేస్తున్నారు. దీంతో శుక్రవారం ‘వెలుగు’ టీమ్ కన్నెపల్లి పంప్​హౌస్​ను సందర్శించింది. తీరంలో నిర్మించిన హెడ్‌‌‌‌ రెగ్యులరేటర్‌‌‌‌ దగ్గరి నుంచి కన్నెపల్లి పంప్‌‌‌‌హౌస్​ వరకు 300 మీటర్ల దూరం ఫోర్‌‌‌‌ బే పక్కన ఉన్న పచ్చటి గడ్డిపై వరద, బురదకు సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదు. గడ్డి అంతా ఆకు పచ్చగానే ఉంది.  ఫోర్‌‌‌‌ బేలో మోటార్లు మునిగిన చోట తప్ప పంప్‌‌‌‌హౌస్​ చుట్టూ నీళ్లే లేవు. పంప్‌‌‌‌హౌస్​ లోపలి భాగాన్ని పరిశీలిస్తే ఫోర్‌‌‌‌బే గోడలు పగిలిపోయి నీళ్లు లోపలికి చొచ్చుకొచ్చిన ఆనవాళ్లు స్పష్టంగా కన్పిస్తున్నాయి. నీటిపైన గోడ సుమారు 10 ఫీట్ల దూరం పగిలిఉంది. ఇంకా నీటిలో ఎంత పొడవున గోడ పగిలిందో పంప్‌‌‌‌హౌస్​‌‌లోని నీటిని లిఫ్ట్‌‌‌‌ చేస్తే తప్ప బయటికి తెలియదు.  

ఆరు నెలల పాటు ఆగిపోనున్న పంపింగ్‌‌‌‌

కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌కు ముఖ్యమైనది కన్నెపల్లి పంప్‌‌‌‌హౌస్​. సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మసాగర్​దాకా నీళ్లందించాలంటే ఇక్కడి నుంచే నీటిని లిఫ్ట్‌‌‌‌ చేయాలి. అలాంటి కన్నెపల్లి పంప్‌‌‌‌హౌస్​ గోదావరి నీటిలో మునిగిపోవడంతో ప్రాజెక్ట్‌‌‌‌ వాటర్‌‌‌‌ పంపింగ్‌‌‌‌ 6 నెలల పాటు ఆగిపోవాల్సి ఉంటుందని ఇంజినీరింగ్‌‌‌‌ నిపుణులు చెప్తున్నారు. మోటార్లన్నీ విదేశాల నుంచి తెప్పించినవే కావడంతో రిపేర్‌‌‌‌ చేసే ఇంజినీర్లను విదేశాల నుంచి రప్పించాలని అంటున్నారు. ఈ సారి వానాకాలంలో ప్రభుత్వం ఆశించినట్లుగా కాళేశ్వరం కింద అదనంగా 57 వేల ఎకరాలకు సాగునీరందించడం కూడా కష్టమేనని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. 

రిపేర్ల ఖర్చు భరించేదెవరు? 

కన్నెపల్లి పంప్‌‌‌‌హౌస్​‌‌లో నీటిలో మునిగిన 17 మోటార్లు, స్కాడా సిస్టమ్‌‌‌‌, కంట్రోల్‌‌‌‌ ప్యానళ్లు, రూ.150 కోట్లతో ఏర్పాటు చేసిన ఆటోమేటెడ్‌‌‌‌ అడ్వాన్స్‌‌‌‌డ్‌‌‌‌ ఎయిర్‌‌‌‌ కండిషన్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌ ఇతరత్రా పనుల కోసం రూ. 400 కోట్లకు పైగా ఖర్చు కానుందని ఇంజినీరింగ్‌‌‌‌ నిపుణులు అంటున్నారు. ఈ రిపేర్‌‌‌‌ ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందా? లేక మేఘా కంపెనీయా? అనే విషయాన్ని నీటిపారుదల శాఖ ఆఫీసర్లు చెప్పడంలేదు. చీఫ్‌‌‌‌ ఇంజినీర్‌‌‌‌గా పనిచేసిన వెంకటేశ్వర్లును ఈ అంశంపై ఫోన్‌‌‌‌లో ‘వెలుగు’ పలుమార్లు ప్రయత్నించినా ఆయన కాల్​లిఫ్ట్​చేయలేదు. కాగా,  తాము చేసిన తప్పిదం ఎక్కడ బయటపడుతుందోనని ఆ సంస్థ ప్రతినిధులు భయపడుతున్నారు. దీంతో మేఘా ప్రతినిధులు, ఆఫీసర్లు కలిసి  కన్నెపల్లి పంప్‌‌‌‌హౌస్ దగ్గరికి శుక్రవారం మీడియాను అనుమతించలేదు. ‘వెలుగు’ ప్రతినిధులు వీరిని ఎలాగోలా  తప్పించుకొని వెళ్లగా కన్నెపల్లి పంప్‌‌‌‌హౌస్​  వద్ద ఫోర్‌‌‌‌బేస్​మెంట్​ గోడ పగిలిన విషయం బయటపడింది.