‘కాంతారా’ చాప్టర్ 1 టికెట్ల సునామీ.. BookMyShowలో గంటకు అన్ని వేల టికెట్లు బుక్ అవడం ఏంటన్నా..!

‘కాంతారా’ చాప్టర్ 1 టికెట్ల సునామీ.. BookMyShowలో గంటకు అన్ని వేల టికెట్లు బుక్ అవడం ఏంటన్నా..!

‘కాంతారా’ చాప్టర్ 1 (Kantara Chapter 1) సినిమా పాజిటివ్ టాక్తో దూసుకెళుతోంది. రిషబ్ శెట్టి (Rishab Shetty) తెరకెక్కించి, నటించిన ఈ ప్రీక్వెల్కు ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన రావడం విశేషం. టికెట్స్ బుకింగ్ వెబ్సైట్ ‘బుక్ మై షో’లో (BookMyShow) గురువారం మధ్యాహ్నం సమయంలో గంటకు 87 వేల టికెట్లు బుక్ అయ్యాయంటే టికెట్స్ ఏ స్థాయిలో తెగాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక సినిమా చుట్టూ పనిగట్టుకుని ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా ఆ సినిమాలో కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారని ‘కాంతారా’ చాప్టర్ 1 రిజల్ట్ మరోసారి ప్రూవ్ చేసింది. ప్రేక్షకులు అల్టిమేట్గా కావాల్సింది వినోదం. సినిమా కంటెంట్ వినోదాత్మకంగా ఉంటే ప్రేక్షకులు మౌత్ టాక్తో సినిమాను బ్లాక్ బస్టర్ చేస్తారు.

‘కాంతారా’ చాప్టర్ 1 సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించే దిశగా ముందుకెళుతోంది. దసరా పండుగ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘కాంతారా’ చాప్టర్ 1 సినిమా రిలీజ్ రోజు మధ్యాహ్నం 2 గంటల లోపే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో 22 కోట్ల మార్క్ను దాటేసింది. ‘కాంతారా’ చాప్టర్ 1 ఓపెనింగ్ డే కలెక్షన్స్ 40 కోట్లు దాటొచ్చని టాక్. దసరా పండుగ.. సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ రావడం, లాంగ్ వీకెండ్ కావడంతో ఈ నాలుగు రోజులు ‘కాంతారా’ చాప్టర్ 1 సినిమా థియేటర్లు కళకళలాడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తెలుగులో కూడా ‘కాంతారా’ చాప్టర్ 1 సినిమా కలెక్షన్ల కుంభవృష్టి కురిపించేలానే ఉంది.

ఈ సినిమా టాక్ బయటకు రాక ముందు హైదరాబాద్ సిటీలో అడ్వాన్స్ బుకింగ్స్ అంతంత మాత్రంగానే ఉన్నా ప్రీమియర్ షోస్ టాక్ బయటికొచ్చాక టికెట్ బుకింగ్స్ అనూహ్యంగా పెరిగాయి. కొన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లయితే ఇవాళ షోస్ అన్నీ బుక్ అయిపోయి All Tickets Are Soldout చూపించిన పరిస్థితి. మల్టీప్లెక్స్ ల్లో కూడా గట్టిగానే బుక్ కావడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ ధరలను పెంచకపోవడం ఈ సినిమా కలెక్షన్లు పెరగడానికి మరింత దోహదపడింది. తెలుగులో కూడా స్ట్రయిట్ తెలుగు సినిమాలు దసరా రేసులో లేకపోవడం, డివైన్ బ్యాక్ డ్రాప్ సినిమా కావడంతో పండుగ రోజు ‘కాంతారా’ చాప్టర్ 1 సినిమాకు ప్రేక్షకులు భారీగా టికెట్లు బుక్ చేసుకుంటున్నారు.

పవన్ కల్యాణ్ OG సినిమాకు డివైడ్ టాక్ రావడం, గ్యాంగ్ స్టర్ డ్రామా జానర్ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ రిషబ్ శెట్టి సినిమాకు వెళ్లేందుకే మొగ్గుచూపుతున్నారు. ఇలా.. పలు అంశాలు ‘కాంతారా’ చాప్టర్ 1 సినిమా కలెక్షన్లకు మంచి బూస్ట్ ఇచ్చాయి. ఫస్ట్ హాఫ్ స్లో పేస్ అనిపించినా బోర్ కొట్టేలా లేకపోవడం, సెకండాఫ్లో సినిమా అంచనాలకు మించి ఎత్తుకోవడంతో ‘కాంతారా’ చాప్టర్ 1 సినిమా చూసిన ప్రేక్షకులు థియేటర్ల నుంచి సంతృప్తికరంగా బయటకు వస్తూ కనిపించారు.