హైదరాబాద్, వెలుగు: దివ్యాంగుల హక్కుల పరిరక్షణ కోసం రైతాంగ పోరాట స్ఫూర్తితో దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని బెంగాల్ మాజీ విద్యాశాఖ మంత్రి కాంతి గంగూలీ అన్నారు. దివ్యాంగుల చట్టం 2016ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) జాతీయ మూడో మహాసభలు ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా ఇందిరాపార్క్ వద్ద ఎన్పీఆర్డీ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు. అంతకు ముందు ‘‘మాపై జాలి, దయ, కరుణ వద్దనీ, మా హక్కులు మాకు కావాలి” అంటూ ర్యాలీ నిర్వహించారు. బహిరంగ సభకు చీఫ్ గెస్ట్ గా హాజరైన కాంతి గంగూలీ మాట్లాడుతూ... దేశంలో దివ్యాంగుల సంక్షేమం నడిరోడ్డుపై ఉందన్నారు. దివ్యాంగులు పేదరికంలో మగ్గుతున్నా.. పాలకులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధమైన పింఛన్ ఇస్తున్నారని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ రంగ సభల్లో లక్షలాది పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదన్నారు. వికలాంగుల చట్టాలు ఉన్నా అవి దేశంలో అమలు కావడం లేదని ఎన్పీఆర్డీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరన్ అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దివ్యాంగుల హక్కులపై దాడి చేస్తున్నదని ఆరోపించారు. ఎన్పీఆర్డీ రాష్ట్ర కార్యదర్శి అడివయ్య, హెలెన్ కెల్లార్ విద్యాసంస్థల అధినేత ఉమ్మర్ ఖాన్ మాట్లాడుతూ.. పింఛన్‌ను రూ.10వేలకు పెంచాలని కోరారు.
ప్రత్యేక టీచర్లు లేక బధిరులు చదువుకు దూరం అవుతున్నారని, జనరల్ స్కూల్స్‌లోనూ స్పెషల్ టీచర్లను నియమించడం లేదన్నారు. సభలో ఎన్పీఆర్డీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరాణి, మోహనన్, కేంద్ర నాయకులు శయమ్మ, ఆర్ వెంకటేశ్, రాజు, మధుబాలు, బలిశ్వర్, దశరథ్, శశికళ, యశోద తదితరులు పాల్గొన్నారు.

