
కపిల్ దేవ్ కు కీలక బాధ్యతను అప్పజెప్పింది క్రికెట్ పాలకుల కమిటి (COA). టీమిండియా కొత్త కోచ్ సెలక్షన్ బాధ్యతను క్రికెట్ పాలకుల కమిటీ (సీఓఏ) కపిల్ దేవ్ నేతృత్వంలోని తాత్కాలిక కమిటీకి అప్పగించింది. కపిల్ దేవ్ తో పాటు అన్షుమన్ గైక్వాడ్, శాంత రంగస్వామి ఈ కమిటీలో ఉన్నారు. వీరు డిసెంబర్ -18లో భారత మహిళల టీమ్ కోచ్ గా డబ్ల్యూవీ రామన్ ను ఎంపిక చేశారు. ఇప్పుడు పురుషుల కోచ్ నూ సెలక్ట్ చేయాలని బీసీసీఐ వారిని కోరిందని తెలిసింది. అప్పటిలాగే ఈ వ్యవహారం మళ్లీ సీఓఏలో విభేదాలకు కారణం కావొచ్చని సమాచారం.
ప్రస్తుత కోచ్ రవిశాస్త్రిని ఇంతకు ముందు గంగూలీ, సచిన్, లక్ష్మణ్ నేతృత్వంలోని క్రికెట్ సలహా సంఘం ఎంపిక చేసింది. ఈ త్రయానికి పరస్పర విరుద్ధ ప్రయోజనాల సెగ తగిలింది. సచిన్ ఈ సమస్యను పరిష్కరించుకున్నారు. దాదా, వీవీఎస్ ఏదో ఒక పదవిని మాత్రమే ఎంచుకోవాలని బీసీసీఐ అంబుడ్స్‌మన్ ఆదేశించింది. ఈ గందరగోళంలో సలహా సంఘం బదులు కపిల్ కమిటీకి కోచ్ ఎంపిక బాధ్యత అప్పగించడం సబబుగా సీఓఏకు తోచింది. ఐతే కపిల్, రంగస్వామి సైతం పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తున్నారు. వీరిద్దరూ బీసీసీఐ కొత్త రాజ్యంగం ప్రకారం ఆటగాళ్ల సంఘం ఏర్పాటు బాధ్యతల్లో తలమునలై ఉన్నారు.