ముంబై: కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్ అంశం ఇండియన్ క్రికెట్‌లో పెనుదుమారం రేపుతోంది. దీని దెబ్బకు ఇటీవల టీమిండియా హెడ్ కోచ్‌గా రవిశాస్త్రిని సెలెక్ట్ చేసిన కపిల్‌దేవ్ నేతృత్వంలోని క్రికెట్ అడ్వైజరీ కమిటీ(సీఏసీ) ఉనికి కోల్పోయింది. బీసీసీఐ ఎథిక్స్ ఆఫీసర్ డీకే జైన్ నుంచి ‘కాన్‌ఫ్లిక్ట్’ నోటీసులు అందుకున్న సీఏసీలోని ముగ్గురు సభ్యుల్లో ఇద్దరు కమిటీని వీడారు. శాంతా రంగస్వామి ఆదివారం కమిటీ నుంచి తప్పుకోగా, సీఏసీ చీఫ్ కపిల్‌దేవ్ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. సీఓఏ చీఫ్ వినోద్‌రాయ్, బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీకి ఈమెయిల్ ద్వారా కపిల్ తన నిర్ణయాన్ని తెలియజేశారు.
జులైలో అడ్‌హక్ కమిటీగా ఏర్పాటైన సీఏసీ ఇండియా మహిళల, పురుషుల జట్ల హెడ్ కోచ్‌ల నియామకం చేపట్టింది. అయితే, ఓ ఫ్లడ్‌లైట్ల సంస్థకు యజమాని, ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్‌లో సభ్యుడైన కపిల్‌దేవ్ సీఏసీలో ఉండడం కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్ కిందకు వస్తుందని మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన సంజీవ్ గుప్తా ఫిర్యాదు చేశాడు. కపిల్ అంశంపై సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ మాట్లాడుతూ.. అయన రాజీనామా చేయాల్సిన పని లేదు. ఎందుకంటే కేవలం హెడ్ కోచ్ ఎంపిక బాధ్యతను మాత్రమే అప్పగిస్తూ వారికి అపాయింట్‌మెంట్ ఆర్డర్ ఇచ్చాం అని అన్నారు.

