టాలీవుడ్‌లో సహాయ నటిగా తనదైన ముద్ర వేసుకున్న వాహిని అలియాస్ పద్మక్క ప్రస్తుతం చావుబతుకుల మధ్య పోరాడుతున్నారు. గత కొన్ని నెలలుగా ఆమెను రొమ్ము క్యాన్సర్ పట్టిపీడిస్తోంది. అడ్వాన్స్‌డ్-స్టేజ్ కారణంగా ఆమె ఆరోగ్యం అత్యంత విషమంగా మారింది. ఈ విషాదకర పరిస్థితిని నటి కరాటే కల్యాణి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. పద్మక్కకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని కోరుతూ ఎమోషనల్ పోస్ట్ చేసింది..
ఆరోగ్యం విషమం, భారీగా వైద్య ఖర్చు.
చిన్న చిన్న పాత్రల ద్వారా తెలుగు, తమిళ పరిశ్రమల్లో గుర్తింపు తెచ్చుకున్న పద్మక్క (జయవాహిని) ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఒక ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. క్యాన్సర్ ముదరడం వల్ల ఆమెకు మల్టీ ఆర్గాన్స్ దెబ్బతిన్నాయని, ఆమెకు తక్షణమే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU) చికిత్స అత్యవసరమని డాక్టర్లు తెలిపారని కల్యాణి పోస్ట్ చేసింది.
కీమోథెరపీ, ఆపరేషన్, నిరంతర ఐసీయూ సంరక్షణ కోసం వైద్యులు దాదాపు రూ.25 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ భారాన్ని పద్మక్క కుటుంబం మోయలేని పరిస్థితి నెలకొంది. ఆర్టిస్ట్ జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో తెలియదని ఎమోషనల్‌గా పోస్ట్ చేసిన కరాటే కల్యాణి.. "తెరపై మనల్ని అలరించిన ఈ నటి కష్టంలో ఉన్నప్పుడు మనందరం ఆదుకోవాలి. మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం.. మీరు కూడా ఒక చేయూతనిస్తారని ఆశిస్తున్నాను అంటూ విజ్ఞప్తి చేశారు.
ఎవరీ జయవాహిని?
వాహిని (పద్మక్క/జయవాహిని) తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో సహాయ నటిగా పనిచేసింది. ముఖ్యంగా బుల్లితెర అనేక సీరియల్స్ లో నటించి ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మద్రాస్ నడిగర్ సంఘం సభ్యత్వం ఉన్న ఆమె, తెలుగు సినిమాల్లో అనేక క్యారెక్టర్ రోల్స్‌లో నటించారు. 'పోలీస్ వారి హెచ్చరిక' ఆమె నటించిన చివరి చిత్రాలలో ఒకటి. విజయనగరంలో తన పెదనాన్న ఇంటి పక్కనే ఉండే పద్మక్క గురించి వ్యక్తిగత అనుబంధాన్ని కూడా కల్యాణి గుర్తు చేసుకున్నారు.
మానవత్వంతో చేయూతనిద్దాం..
జయవాహిని గారికి సకాలంలో అత్యవసర వైద్య సహాయం అందకపోతే ప్రాణాపాయం పొంచి ఉంది. ఆమె కష్ట సమయంలో మనందరం కలిసి ఆమెకు సహాయం చేసి ఒక ప్రాణాన్ని నిలబెట్టాలని కోరుకుందాం. మీరు అందించే చిన్న మొత్తం కూడా ఆమె తదుపరి కీమో , ఆపరేషన్ చికిత్సలకు అమూల్యమైన సహాయం అవుతుంది అంటూ... ఆమె బ్యాంక్ అకౌంట్, యూపీఐ వివరాలను కరాటే కల్యాణి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నెటిజన్లు ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు. ఆర్థిక సహాయం చేసి, ఆమె క్యాన్సర్‌ను జయించి తిరిగి మనల్ని అలరించారని కోరుతున్నారు.

