- ఆదిబట్ల పీఎస్లో ఫిర్యాదు
ఇబ్రహీంపట్నం, వెలుగు: హిందూ ధర్మం కోసం పోరాడుతుంటే తనపై దాడి చేశారంటూ కరాటే కల్యాణి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ మేరకు ఆదిబట్ల పీఎస్లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బెట్టింగ్ యాప్, లక్కీ డ్రా పేరుతో అమాయకులను మోసం చేస్తూ పవిత్రమైన తిరుమల క్షేత్రంలో ప్రచారం నిర్వహించిన ఇన్ఫ్లుయెన్సర్లపై చర్యలు తీసుకోవాలని పంజాగుట్ట పోలీసులకు గతంలో ఆమె ఫిర్యాదు చేశారు.
దీంతో మంగళవారం ఆదిబట్ల పరిధిలోని వండర్ లా వెనుక విల్లాలో ఫార్చూనర్ లక్కీ డ్రా తీసేందుకు ప్రయత్నిస్తుండగా, పంజాగుట్ట పోలీసులతో కలిసి కరాటే కల్యాణి అక్కడి వెళ్లారు. అక్కడ లక్కీ డ్రా జరుగుతుండగా నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా లక్కీ డ్రా వద్ద ఉన్న నరేందర్ మద్దతుదారులు కరాటే కల్యాణితో వాగ్వివాదానికి దిగారు. అనంతరం వ్యక్తిగతంగా తనను నరేందర్, మరికొందరు దూషించి దాడి చేశారని ఆదిబట్ల పీఎస్లో ఆమె ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హిందూ ధర్మం కోసం పోరాడుతుంటే వెంట ఉండాల్సింది పోయి వ్యక్తిగతంగా దూషిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతొ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
