జవాన్ల త్యాగం యువతకు స్ఫూర్తి...ఆత్మనిర్భర్‌‌‌‌‌‌‌‌తో దేశం బలోపేతం: రాంచందర్ రావు

జవాన్ల త్యాగం యువతకు స్ఫూర్తి...ఆత్మనిర్భర్‌‌‌‌‌‌‌‌తో దేశం బలోపేతం: రాంచందర్ రావు
  •     కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమర జవాన్లకు నివాళి

హైదరాబాద్, వెలుగు: కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా భారత జవాన్ల ధైర్యసాహసాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు కొనియాడారు. ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌‌‌‌‌‌‌‌లోని వీర సైనిక స్మారక స్తూపం వద్ద అమర జవాన్లకు నివాళులర్పించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల త్యాగం ఎప్పటికీ మరువలేనిదని, వారి పరాక్రమమే యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. కార్గిల్ యుద్ధంలో క్లిష్ట పరిస్థితుల్లోనూ శత్రువులను ఓడించి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ఘనత భారత సైన్యానిదేనని చెప్పారు. దేశ సరిహద్దులను కాపాడుతున్న ప్రతి జవాన్‌‌‌‌‌‌‌‌కు దేశ ప్రజల తరఫున వందనం చేస్తున్నామని పేర్కొన్నారు. వన్ ర్యాంక్-వన్ పెన్షన్ కమిషన్ మాజీ చైర్మన్ ఎల్. నర్సింహారెడ్డి మాట్లాడుతూ సైనికుల పెన్షన్ సమస్యలను పరిష్కరించడం చారిత్రాత్మక నిర్ణయమని చెప్పారు. యువత దేశ సేవలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఆత్మనిర్భర్ భారత్‌‌‌‌‌‌‌‌తోనే అగ్రగామి ..

బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌లో ఫోరమ్ ఫర్ నేషనలిస్ట్ థింకర్స్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ అంశాల సదస్సులో రాంచందర్ రావు మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ఆత్మనిర్భర్ దిశగా వేగంగా ముందుకు వెళ్తోందన్నారు. ఒకప్పుడు ఇతర దేశాలపై ఆధారపడిన భారత్.. ఇప్పుడు రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి చేరిందని చెప్పారు. దేశం ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, గత పదేళ్లలో మౌలిక సదుపాయాలు గణనీయంగా అభివృద్ధి చెందాయని అన్నారు. 

2014 వరకు దేశంలో కేవలం 75 విమానాశ్రయాలు మాత్రమే ఉండగా, నేడు ఆ సంఖ్య 150 దాటిందని గుర్తు చేశారు.  కరోనా సమయంలో దేశంలోనే వ్యాక్సిన్ తయారు చేసి ప్రజలకు ఉచితంగా అందించడమే కాకుండా ఇతర దేశాలకు కూడా సరఫరా చేశామని గుర్తు చేశారు. ప్రపంచంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల్లో ఆత్మనిర్భర్ భారత్ మరింత అవసరమని పేర్కొన్నారు.  కార్యక్రమంలో ప్రముఖ ఆర్థికవేత్త ఎస్. గురుమూర్తి, ఏవీ గురువారెడ్డి, ప్రొఫెసర్ నాగరాజు, బిపిన్ పెండ్యాల తదితరులు పాల్గొన్నారు.