కరీంనగర్, వెలుగు: కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపస్ కార్యాలయంపై దాడి, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వాహనాన్ని బీజేపీ నాయకులు ధ్వంసం చేసిన ఘటనకు నిరసనగా బీఆర్ఎస్ ఇచ్చిన కరీంనగర్ బంద్ శనివారం పాక్షికంగా జరిగింది. ప్రధాన రహదారులపై చాలా చోట్ల దుకాణాలు, పెట్రోల్ బంకులు యథావిథిగా తెరుచుకున్నాయి.
బీఆర్ఎస్ నాయకులను పలుచోట్ల పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఉదయం నుంచే ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంటి వద్ద పోలీసులు మోహరించి ఆయనను హౌస్ అరెస్టు చేశారు. తర్వాత నల్లజెండాలతో ఎమ్మెల్యే ఇంటి నుంచి ర్యాలీగా బయల్దేరగా పోలీసులు అడ్డుకున్నారు.
గేట్లు నెట్టుకుని బయటకు రావడంతో గంగుల కమలాకర్‌తో పాటు బీఆర్ఎస్ సిటీ అధ్యక్షుడు చల్లా హరిశంకర్, కార్పొరేటర్ రవీందర్ సింగ్ తదితరులను పోలీసులు అరెస్టు చేసి సీటీసీకి తరలించారు. ఈ సమయంలో కొందరు బీఆర్ఎస్ నాయకులు కోర్టు చౌరస్తాలో కేంద్ర మంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. గంగాధర మండలం బూరుగుపల్లి నుంచి బయల్దేరిన చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను పోలీసులు మార్గమధ్యలో అదుపులోకి తీసుకున్నారు.
