హైదరాబాద్: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) మెగా వేలంలో కరీంనగర్ ప్లేయర్, భారత స్టార్ ఆల్ రౌండర్ శిఖా పాండే జాక్ పాట్ కొట్టింది. ఏకంగా రూ.2.4 కోట్ల భారీ ధరకు శిఖా పాండేను యూపీ వారియర్స్ సొంతం చేసుకుంది. కేవలం రూ.40 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన శిఖా పాండే కోసం ఆక్షన్‌లో ప్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరికి రూ.రూ.2.4 కోట్ల భారీ ధరకు యూపీ వారియర్స్ శిఖాను దక్కించుకుంది.
శిఖా పాండేతో పాటు హైదరాబాదీ ఆల్ రౌండర్ అరుంధతి రెడ్డి కూడా భారీ పలికింది. రూ.75 లక్షలకు అరుంధతి రెడ్డిని ఆర్సీబీ కొనుగోలు చేసింది. అలాగే, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో తెలుగు క్రికెటర్ శ్రీచరణికి కూడా మంచి ధర లభించింది. రూ.1.3 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ఆఫ్ స్పిన్నర్‌ను దక్కించుకుంది.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2026 సీజన్ మెగా వేలం గురువారం (నవంబర్ 27) ఢిల్లీలో ప్రారంభమైంది. మెగా ఆక్షన్ కావడంతో స్టార్ ప్లేయర్స్‌పై భారీ హైప్ నెలకొంది. మొత్తం 277 మంది ప్లేయర్స్ మెగా ఆక్షన్‌లోకి వచ్చారు. ఇందులో 73 స్థానాల కోసం ప్లేయర్స్ పోటీ పడనున్నారు. 194 మంది భారత ప్లేయర్స్ వేలంలో ఉన్నారు. వీరిలో 52 మంది క్యాప్డ్ ప్లేయర్స్ ఉండగా, 142 మంది అన్ క్యాప్డ్ ప్లేయర్స్. డబ్ల్యూపీఎల్ జట్లు ముంబై, బెంగుళూర్, గుజరాత్, ఢిల్లీ, యూపీ ఐదు ఫ్రాంచైజీలు తమ జట్టును పటిష్టం చేసుకోవడానికి సిద్ధమయ్యాయి.
శిఖా పాండే సక్సెస్ స్టోరీ:
టీమిండియా మహిళా జట్టు స్టార్ ఆల్ రౌండర్ శిఖా సుభాష్ పాండే 1989, మే 12న కరీంనగర్ జిల్లాలోని రామగుండంలో జన్మించింది. చిన్నప్పటి నుంచి శిఖా పాండే క్రికెట్ అంటే పిచ్చి. 15 ఏళ్ల వయసులో జాతీయ స్థాయిలో గోవా తరుఫున ప్రాతినిధ్యం వహించింది. ఆటలతో పాటు చదువుల్లోనే శిఖా చురుగ్గా ఉండేది. సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షల్లో టాపర్‌గా నిలిచింది. ఒక పక్క చదువుతూనే.. మరోపక్క క్రికెట్ ప్రాక్టీస్ కొనసాగించింది.
గోవా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది. గ్రాడ్యుయేషన్ తరువాత అనేక ఎంఎన్‌సీ కంపెనీల్లో భారీ జీతంతో ఆఫర్లు వచ్చినప్పటికీ.. క్రికెట్‌పై ఇష్టంతో వాటినితిరస్కరించింది. అంతర్జాతీయ వేదికపై భారత్‌కు ప్రాతినిధ్యం వహించాలనే తన డ్రీమ్ ను ఫుల్ ఫిల్ చేసుకోవడం కోసం క్రికెట్‌పై పూర్తి స్థాయిలో దృష్టిసారించింది. ఈ క్రమంలో శిఖా పాండే 2011లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF)లో ఉద్యోగం సాధించింది.
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్(ATC) నుంచి స్క్వాడ్రన్ లీడర్ స్థాయికి ఎదిగింది. ఎయిర్ ఫోర్స్‌లో జాబ్ చేస్తున్నప్పటికీ.. క్రికెట్‌ను వదిలేయలేదు. ఎట్టకేలకు 2014లో శిఖా పాండే జీవితకాల వాంఛ నేరవేరింది. 2014లో భారత మహిళల క్రికెట్ జట్టులో శిఖా చోటు దక్కించుకుంది. దీంతో ఎయిర్ ఫోర్స్ ఉద్యోగానికి రాజీనామా చేసి క్రికెట్ కెరీర్ ప్రారంభించింది. 2014లోనే టెస్ట్, వన్డే, టెస్ట్ మూడు ఫార్మాట్లలో జాతీయ జట్టు తరుఫున అరంగ్రేటం చేసింది.
రైట్ ఆర్మ్ మీడియం పేసర్‌తో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా శిఖా జట్టుకు సేలందించింది. 2020లో జరిగిన ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్‌లో భారత జట్టులో భాగమైంది. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) ప్రారంభ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరుఫున ఆడింది. 2026 సీజన్ కోసం జరిగిన మెగా వేలంలో శిఖా పాండేను రూ.2.4 కోట్ల భారీ ధరకు యూపీ వారియర్స్ సొంతం చేసుకుంది. ఇక దేశీయ క్రికెట్లో శిఖా దాదాపు రెండు దశాబ్దాల పాటు గోవా తరఫున ఆడింది. తర్వాత 2025-26 సీజన్ కోసం బరోడా జట్టుకు మారారు.
