సెలవులో కరీంనగర్ సీపీ.. ఎస్సై అక్రమాల విషయంలో ఎమ్మెల్యే ఒత్తిళ్లతో మనస్తాపం

సెలవులో కరీంనగర్ సీపీ.. ఎస్సై అక్రమాల విషయంలో ఎమ్మెల్యే ఒత్తిళ్లతో మనస్తాపం
  • ఎస్సైపై సస్పెన్షన్ వేటు వేసి లీవ్‌‌ పెట్టిన సీపీ

కరీంనగర్, వెలుగు : కరీంనగర్‌‌ పోలీస్‌‌ కమిషనర్‌‌ గౌష్‌‌ ఆలం సెలవుపై వెళ్లారు. కమిషనరేట్‌‌ పరిధిలో పనిచేసే ఓ ఎస్సైపై అవినీతి ఆరోపణలు రావడంతో చర్యలు తీసుకున్న సీపీపై స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే సదరు నేత నుంచి పదే పదే ఫోన్లు రావడంతో విసుగు చెందిన సీపీ.. సోమవారం నుంచి లీవ్‌‌పై వెళ్లిపోయారు. కరీంనగర్‌‌ కమిషనరేట్‌‌ పరిధిలోని ఓ స్టేషన్‌‌లో పనిచేస్తున్న ఎస్సై ఇసుక ట్రాక్టర్ల నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నారని సీపీకి ఫిర్యాదులు అందాయి. దీంతో రంగంలోకి దిగి సీపీ కొందరు ట్రాక్టర్‌‌ డ్రైవర్లు, ఓనర్ల నుంచి సమాచారం సేకరించారు. 

ఎస్సై అక్రమాలు నిజమేనని తేలడంతో అతడిని అటాచ్‌‌ చేసేందుకు రెడీ అయ్యారు. విషయం తెలుసుకున్న సదరు ఎస్సై.. స్థానిక ఎమ్మెల్యేకు సమాచారమివ్వడంతో ఆయన సీపీకి ఫోన్‌‌ చేసి ఎస్సైపై  ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పినట్లు తెలిసింది.

 దీంతో ఎస్సై క్రమశిక్షణారాహిత్యంపై ఆగ్రహించిన సీపీ అతడిని తొలుత అటాచ్‌‌ చేసినట్లు సమాచారం. దీంతో సదరు ఎమ్మెల్యే మరో ముఖ్యనేతతో సీపీకి ఫోన్‌‌ చేయించడంతో.. సీపీ మరో అడుగు ముందుకేసి ఎస్సైని సస్పెండ్‌‌ చేశారు. అయినా ఒత్తిళ్లు ఆగకపోవడంతో సీపీ సోమవారం నుంచి సెలవుపై వెళ్లిపోయారు. సీపీ ఎప్పటి వరకు సెలవులో ఉంటారన్న విషయంలో సస్పెన్స్ నెలకొంది.