
- 187 మంది స్టూడెంట్స్‌కు ఇద్దరే కోచ్‌లు
- ముగ్గురు సబ్జెక్ట్ టీచర్లూ లేరు బెంచీలు.. మంచాలకూ దిక్కులేదు
- అస్త్యవస్త్యంగా మెస్ .. హెల్దీ ఫుడ్ ఉత్త ముచ్చటే!
- అలంకారప్రాయంగా సింథటిక్ ట్రాక్.. స్విమ్మింగ్ పూల్
కరీంనగర్, వెలుగు : అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కరీంనగర్లో ఏర్పాటు చేసిన రీజినల్స్పోర్ట్స్స్కూల్లో కావాల్సిన కోచ్‌లను మాత్రం నియమించలేదు. 2007లో ప్రారంభించిన ఈ స్కూల్లో పిల్లల అభిరుచి, సామర్థ్యాలను బట్టి తగిన క్రీడల్లో శిక్షణ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ కేవలం ఇద్దరితో అదీ ఓ యోగా మాస్టర్, జిమ్నాస్టిక్స్కోచ్లతో నెట్టుకొస్తున్నారు. ఈ ఇద్దరే ఉదయం, సాయంత్రం నాలుగు ఆసనాలు, మూడు విన్యాసాలతో మమ అనిపిస్తున్నారు. రెండు, మూడేండ్లుగా కోచ్‌లు లేకపోవడంతో స్టూడెంట్స్ఆయా క్రీడల్లో కనీస మెళకువలు కూడా నేర్చుకోలేకపోతున్నారు. 12 ఏండ్ల పాటు అంబేద్కర్‌స్టేడియంలో నిర్వహించినా 2019లో బైపాస్ రోడ్డులో ఉన్న ఉజ్వల పార్క్సమీపంలో అన్ని హంగులతో బిల్డింగ్నిర్మించినా సౌకర్యాలు కల్పించలేదు. కూర్చునేందుకు బెంచీలు, పడుకునేందుకు మంచాలు, వేసుకునేందుకు ట్రాక్సూట్స్కూడా లేవు. హెల్దీ డైట్మెయింటెయిన్ చేయాల్సి ఉన్నా మామూలు పిల్లలకు పెట్టినట్టే ఫుడ్పెడుతున్నారు.
పది మంది ఉండాల్సిన చోట ఇద్దరే కోచ్ లు
స్పోర్ట్స్ స్కూల్ లో రెగ్యులర్పాఠశాల లెక్కనే పాఠాలు చెప్పడంతో పాటు ఉదయం, సాయంత్రం ఆటలు ఆడిస్తారు. ప్రధానంగా స్టూడెంట్స్ ను ఆటలపైనే ఫోకస్చేయించాల్సి ఉండగా ఇక్కడ ఆ పరిస్థితి లేదు. 187 మంది స్టూడెంట్స్ ఉంటే ఇద్దరు మాత్రమే కోచ్ లు ఉన్నారు. అది కూడా యోగా, జిమ్నాస్టిక్స్ చెప్పేవాళ్లే. రెజ్లింగ్, అథ్లెటిక్స్, స్విమ్మింగ్, జూడో, వాలీబాల్ వంటి క్రీడలకు కోచ్‌లే లేరు. దాదాపు మూడేండ్ల నుంచి ఇదే దుస్థితి ఉన్నా పట్టించుకునేవారే లేరు. పోనీ రెగ్యులర్టీచింగ్క్లాసులు సరిగ్గా జరుగుతున్నాయా అంటే అదీ లేదు. మూడేండ్ల కింద ఫిజికల్ సైన్స్, తెలుగు, సోషల్ టీచర్లు రిటైర్ అయ్యారు. ఇవ్వాల్టికి వీరి స్థానంలో కొత్తవారిని నియమించలేదు. దీంతో ఉన్న టీచర్లే సబ్జెక్టులను పంచుకుని చెప్తున్నారు.
పూర్తయినా నో యూజ్
స్పోర్ట్స్స్కూల్స్టూడెంట్స్కోసం ప్రత్యేకంగా నిర్మించిన సింథటిక్ ట్రాక్.. స్విమ్మింగ్ పూల్ ను ఇంకా అందుబాటులోకి తీసుకురాలేదు. రూ.7 కోట్లతో 400 మీటర్ల సింథటిక్ ట్రాక్ ను రెండు నెలల కిందే కట్టారు. అలాగే వదిలేయడంతో వర్షాలకు ట్రాక్ చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగాయి. సెంట్రల్ ఫండ్స్ తో నిర్మించిన ఈ ట్రాక్ ను స్టేట్ లీడర్లు ఓపెన్ చేయాలా.. లేక సెంట్రల్ మినిస్టర్ తో చేయించాలా అనే డైలామా కొనసాగుతోంది. దీంతో పాటు స్విమ్మింగ్ పూల్ కూడా పూర్తయి నెలలు గడుస్తున్నా ప్రారంభించడం లేదు.
అస్తవ్యస్తంగా మెస్..
స్పోర్ట్స్ స్కూల్విద్యార్థులు స్ట్రాంగ్ గా ఉండడానికి బలవర్ధకమైన ఆహారం పెట్టాల్సి ఉంటుంది. వీరి కోసం ప్రత్యేక మెనూ పాటించాలి. కానీ కేవలం అన్నం, చపాతీలు మాత్రమే ఇక్కడ చేసి బయటి నుంచి కూరలు తీసుకువస్తున్నారు. దీంతో అక్కడ వండే కూరగాయలు నాణ్యమైనవో లేక నాసిరకమైనవో తెలియడం లేదు. ఇక డైనింగ్ హాల్ ఉన్నా పిల్లలు కూర్చునేందుకు బల్లలు లేక నేలమీద కూర్చుని తింటున్నారు. స్పోర్ట్స్ స్కూల్ కు ఫండ్స్ ఉన్నా ఖర్చు చేయాలనే ఆలోచన, పిల్లలకు సౌకర్యాలు కల్పించాలనే సోయి అధికారులకు లేకపోవడంతో పిల్లలు తిప్పలు పడాల్సి వస్తున్నది, స్కూల్పరిసరాలు కూడా పిచ్చి మొక్కలతో నిండి పందులు, కుక్కల సంచారంతో అపరిశుభ్రంగా మారాయి. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్‌లో ఈ స్కూల్లో ని స్టూడెంట్స్అంతర్జాతీయ స్థాయికి కాదుకదా, కనీసం జిల్లాస్థాయిలోనూ ఆడే పరిస్థితి ఉండదని స్టూడెంట్స్, పేరెంట్స్ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బెంచీలు.. మంచాల్లేవ్
మన రాష్ట్రంలో హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్ లోనే స్పోర్ట్స్ స్కూళ్లున్నాయి. నాలుగో తరగతిలో చేరిన స్టూడెంట్స్ పదో తరగతి పూర్తయ్యేలోగా తాము ఎంచుకున్న ఆటలో రాటుదేలాలి. కానీ కోచ్‌లు, ఫెసిలిటీస్లేక అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదు. ఈసారైతే నాలుగో తరగతిలోకి ప్రవేశాలు తీసుకోకపోవడంతో ఐదు నుంచి పది వరకు మాత్రమే క్లాస్ లు జరుగుతున్నాయి. ఇందులో ఎనిమిది, తొమ్మిది, పది తరగతుల స్టూడెంట్స్ కు మాత్రమే క్లాస్ రూముల్లో కూర్చునేందుకు కుర్చీలున్నాయి. ఐదు నుంచి ఏడు వరకు విద్యార్థులంతా క్లాస్ రూమ్ ల్లో కిందనే కూర్చుని చదువుకుంటున్నారు. హాస్టల్ లో ఈ తరగతుల పిల్లలు పడుకునేందుకు మంచాలు లేక ఫ్లోర్ పైనే నిద్రపోతున్నారు. ప్రతి ఏటా స్టూడెంట్స్ కు ట్రాక్ సూట్స్, షూస్ అందించాల్సి ఉన్నా నేటికీ అందలేదు. నాలుగేండ్ల కిందట అప్పటి కలెక్టర్ సర్ఫరాజ్ ఆహ్మద్ ఇచ్చిన సూట్లే తప్పా.. కొత్తగా ఒక్కటి కూడా కొనలేదు.
గురుకులం సీటు వదులుకున్నం
కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్ బాగుంటుందని మా అబ్బాయిని చేర్పించాను. ఇక్కడికి వచ్చి చూస్తే అంతా రివర్స్ లో ఉంది. పరిసరాల్లో గడ్డి పెరిగింది. పందులు, కుక్కలు వస్తున్నాయి. సింథటిక్ ట్రాక్ ఓపెన్ చేస్తలేరు. ఇట్లయితే పిల్లలు ఎట్లా ప్రాక్టీస్ చేస్తరు? కోచ్ లు కూడా లేరు. గురుకులంలో సీటు వచ్చినా.. అది వదులుకుని ఫ్యూచర్ బాగుంటుందని వస్తే ఇలా జరిగింది.
- ఏల్పుల కుమార్, పరిగి , పేరెంట్
ఈ మాత్రం దానికి ఇక్కడిదాక ఎందుకు..?
మేము గద్వాల నుంచి పిల్లలను తీసుకొచ్చాం. మా ఏరియా వాళ్లే ఆరుగురున్నారు. గద్వాలలో స్టేడియం ఉన్నా స్పోర్ట్స్స్కూల్ కదా అని తీసుకువచ్చాం. ఇప్పడు ఇక్కడి కంటే మా దగ్గరే నయమనిపిస్తోంది. ఇద్దరు కోచ్‌లు ఉన్నారు. అది కూడా యోగా, జిమ్మాస్టిక్స్అంట...వీళ్లిద్దరితో ఏమవుతుంది? వెంటనే కోచ్‌లను నియమించి ఫెసిలిటీస్కల్పించాలి.
- పెద్దింటి రాఘవేంద్ర, గద్వాల, పేరెంట్
ప్రపోజల్స్ పంపించాం
స్టూడెంట్స్ కు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పిస్తున్నాం. కోచ్ లను వారం రోజుల్లో రిక్రూట్ చేస్తాం. స్టూడెంట్స్ కు కావాల్సిన బెంచీలు, మంచాలు తయారు చేయించేందుకు కొటేషన్లు తీసుకున్నాం. త్వరలోనే సింథటిక్ ట్రాక్ కూడా ఓపెన్ చేస్తాం.
- రాజ్ వీర్, డీవైఎస్ ఓ, కరీంనగర్