
భారత స్టాక్ మార్కెట్లు ఈ వారం సానుకూలంగా ప్రారంభమయ్యాయి, దింతో సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్, నిఫ్టీ రెండూ పెరిగాయి. సెన్సెక్స్ 704 పాయింట్లు పెరిగి 84,656.56కి చేరుకోగా, నిఫ్టీ 216 పాయింట్లు పెరిగి 25,926.20కి చేరుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, HDFC బ్యాంక్ వంటి ప్రముఖ కంపెనీల లాభాలు ఈ ర్యాలీకి తోడైయ్యాయి
రిలయన్స్, HDFC బ్యాంక్ : సెప్టెంబర్ త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ బలమైన ఆదాయాలను ప్రకటించిన తర్వాత కంపెనీ షేర్లు 2 శాతానికి పైగా పెరిగాయి. కంపెనీ లాభం గత సంవత్సరంతో పోలిస్తే 9.6 శాతం పెరిగింది, రిటైల్ అలాగే టెలికాం వ్యాపారాలలో మంచి పనితీరు, చమురు-రసాయనాల విభాగం కోలుకోవడం దీనికి దోహదపడింది.
మార్కెట్ ర్యాలీకి HDFC బ్యాంక్ కూడా మద్దతు ఇచ్చింది. సెప్టెంబర్ త్రైమాసికంలో లాభం 10 శాతం పెరిగి రూ.19,610.67 కోట్లకు చేరుకోవడంతో షేర్స్ 1.54 శాతం పెరిగింది. ఈ ఫలితాలు మొత్తం మార్కెట్ సెంటిమెంట్‌కు బూస్ట్ ఇచ్చాయి.
ఇవాళ ఉదయం యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు లాభాలు ఆర్జించగా, ఐసిఐసిఐ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, ట్రెంట్, టాటా స్టీల్ షేర్లు ఒత్తిడిలో నష్టపోయాయి.
ఇక జపాన్, దక్షిణ కొరియా, చైనా, హాంకాంగ్‌లలో సూచీలు లాభాలను ఆర్జించడంతో ఆసియా మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. శుక్రవారం అమెరికా మార్కెట్లు కూడా లాభాలతో ముగిశాయి. శుక్రవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIలు) రూ.308.98 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (DIIలు) రూ.1,526.61 కోట్ల విలువైన షేర్లను కొన్నారు.
జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వి.కె. విజయకుమార్ మాట్లాడుతూ దేశీయ కొనుగోళ్లు, క్యూ2లో మంచి ఆదాయాలు, పండుగ సీజన్ డిమాండ్ మార్కెట్ బలానికి మద్దతు ఇస్తున్నాయని అన్నారు. ఇందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, రిలయన్స్ అద్భుతమైన ఫలితాలు పాజిటివ్ అంశాలు అని అన్నారు. అంతేకాక ప్రపంచ చమురు ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌కు 0.36% తగ్గి 61.07 డాలర్లకు చేరుకుంది.